చైనా, ఇండియా మధ్య సైనిక ఘర్షణలు పూర్తిగా తొలగిపోలేదు. ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేలా భారత్ సిద్ధమవుతోంది. నిజానికి వాస్తవాధీన రేఖ(Line of Actual Control) వెంబడి మౌలిక సదుపాయాలలో చైనా ముందుంది. అయితే ఈ అంతరాయాన్ని తగ్గించేందుకు ఇండియా చర్యలు తీసుకుంటోంది. రెండేళ్లలో ఎక్కువగా రోడ్లు, సొరంగాలు, వంతెనలు, సైనికుల నివాసాలు, శాశ్వత రక్షణ, హెలిప్యాడ్లు, ఎయిర్‌ఫీల్డ్‌ల నిర్మాణాలు చేపట్టిందని డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ సోర్సెస్ ద్వారా తెలిసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.
* చైనా బలగాల సంఖ్య తగ్గలేదు
గత వారం కూడా LAC వద్ద పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాల సంఖ్యలో గణనీయమైన తగ్గింపు లేదని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే హెచ్చరించారు. చైనా సరిహద్దు మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా జరుగుతోందని చెప్పారు. కొత్త G-695 జాతీయ ఎక్స్‌ప్రెస్‌వే కోసం చైనా ప్రణాళికను జనరల్ పాండే ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది వివాదాస్పద భూభాగం అయిన అక్సాయ్ చిన్ ద్వారా LACకి సమాంతరంగా నడుస్తుంది. జిన్జియాంగ్ ప్రావిన్స్‌ను టిబెటన్ అటానమస్ రీజియన్‌తో కలుపుతుంది. ఇది PLAకి బలగాలను ముందుకు తరలించడమే కాకుండా ఒక సెక్టార్ నుంచి మరొక సెక్టార్‌కు బలగాలను మార్చగల సామర్థ్యాన్ని అందిస్తుందని తెలిపారు. ఇండియా తన రక్షణను కోల్పోవడానికి సిద్ధంగా లేదని స్పష్టం చేశారు.
* తూర్పు లడఖ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో నిర్మాణాలు
తూర్పు లడఖ్‌లో 30 నెలల మిలిటరీ కన్‌ఫ్రంటేషన్ కొనసాగుతోంది. వరుసగా మూడో శీతాకాలం భారత్, చైనా దళాలు సరిహద్దుల వద్ద ముందుకు వచ్చి మోహరించి ఉన్నాయి. ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ద్వారా మరిన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాజెక్టులు మొదలవడానికి సిద్ధంగా ఉన్నాయి. తూర్పు లడఖ్‌లోని అధిక ఎత్తులో ఉన్న ప్రాంతాలలో 22,000 మంది సైనికులు, 450 ట్యాంకులు, హోవిట్జర్ల టెక్నికల్ స్టోరేజ్ ఫెసిలిటీ కోసం 'మాడ్యులర్, టెంపరేచర్ కంట్రోల్డ్ అండ్ రీలొకేటబుల్ హబిటాట్’ నిర్మించారు. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ , సిక్కింలో 3,488-కిమీ LAC వెంట ఇలాంటి నిర్మాణాలు చేపడుతున్నారు.
* పెరిగిన సామర్థ్యం
పర్మినెంట్ డిఫెన్స్‌లో భాగంగా IIT గాంధీనగర్‌లోని స్టార్ట్అప్లతో కలిసి 100 మీటర్ల T-90 ట్యాంకుల నుంచి డైరెక్ట్ హిట్స్ తీసుకునే కొత్త హైటెక్ `3D ప్రింటింగ్' నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే చాలా ట్రయల్స్ జరిగాయి. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది నుంచి తూర్పు లడఖ్‌లోనే కాకుండా ఉత్తర సరిహద్దుల వెంబడి అందుబాటులోకి వస్తుందని సోర్సెస్ వివరించాయి. ఆర్మీ ఇప్పుడు భారీ ఎక్స్కవేటర్లు, స్పైడర్ ఎక్స్కవేటర్లు, తేలికపాటి క్రాలర్ రాక్ డ్రిల్స్ వంటి కొత్త తరం డివైజెస్ మోహరించడంతో, తూర్పు లడఖ్, ఇతర ప్రాంతాలలో కాంబ్యాట్ ఇంజినీర్ల సామర్థ్యం మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగిందని తెలిపారు.
* కీలకమైన టన్నెల్స్ నిర్మాణం
అన్ని వాతావరణాల్లో కనెక్టివిటీ, ఫార్వర్డ్ ప్రాంతాలలో త్వరితగతిన దళం మోహరింపులు, మందుగుండు సామగ్రి, క్షిపణులు, ఇంధనం, ఇతర సామాగ్రి భూగర్భ నిల్వ కోసం టన్నెల్స్ కీలకం. ప్రస్తుతం తొమ్మిది కొత్త టన్నెల్స్ నిర్మాణంలో ఉన్నాయి. అరుణాచల్‌లోని తవాంగ్‌కు వ్యూహాత్మక 2.5-కిమీ సెలా టన్నెల్‌ను రూ.687 కోట్లతో 13,000 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు. మరో 11 టన్నెల్స్ ప్రణాళికలో ఉన్నాయని పేర్కొన్నారు.
* వేగంగా రహదారుల ప్రాజెక్టులు
అనేక రహదారుల ప్రాజెక్టులు కూడా జరుగుతున్నాయి. 2026 నాటికి మనాలి యాక్సిస్ నుంచి నేరుగా 298-కిమీ NHDL (నేషనల్ హైవే డబుల్ లేన్) స్పెసిఫికేషన్ రోడ్డు ద్వారా పశ్చిమ లడఖ్, జంస్కార్ వ్యాలీకి ఆల్టర్నేటివ్ కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. రోడ్డులో 4.1-కిమీ ట్విన్ ట్యూబ్ షింకున్ లా టన్నెల్ ఉంది. దాదాపు 65 శాతం పనులు పూర్తయ్యాయని సోర్సెస్ వివరించాయి. అదేవిధంగా కీలకమైన దర్బుక్-ష్యోక్-దౌలత్ బేగ్ ఓల్డి (DS-DBO) రహదారిపై, కీలకమైన అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్, LAC సమీపంలో పోస్ట్‌కు కనెక్టివిటీని అందిస్తుంది. 35 వంతెనలు "క్లాస్-70" స్పెసిఫికేషన్లకు అప్‌గ్రేడ్ చేస్తున్నారని, వచ్చే వర్కింగ్ సీజన్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని సోర్సెస్ చెప్పాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India-China