(అనంత్ నాగ్ నుంచి పీర్ ముదాసిర్ అహ్మద్)
జమ్మూకాశ్మీర్‌లో మరోసారి మిలిటెంట్లు తెగబడ్డారు. సీఆర్పీఎఫ్ పెట్రోల్ పార్టీ మీద గ్రెనేడ్ దాడి చేశారు. దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్‌లో లాల్ చౌక్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. గ్రెనేడ్ దాడితో లాల్ చౌక్ ప్రాంతంలో కలకలం రేగింది. అందరూ భయకంపితులు అయ్యారు. గాయపడిన జవాన్లను వెంటనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చికిత్స కోసం తరలించారు. వారికి అక్కడ చికిత్స జరుగుతోంది. గాయపడిన జవాన్లను హర్యానాకు చెందిన చంద్రపాల్, ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన సునీల్ కుమార్‌గా గుర్తించారు. మిలిటెంట్లు సీఆర్పీఎఫ్ పెట్రోల్ పార్టీ మీద గ్రెనేడ్ దాడి చేశారని తెలిసిన వెంటనే ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు రంగంలోకి దిగారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను కార్డన్ సెర్చ్ చేపడుతున్నారు. మిలిటెంట్ల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఘటన గురించి తెలిసిన వెంటనే సీనియర్ అధికారులు, పోలీసులు గ్రెనేడ్ దాడి జరిగిన ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. భద్రత గురించి పర్యవేక్షించారు. లాల్ చౌక్ అనేది దక్షిణ కాశ్మీర్లో ఓ కమర్షియల్ హబ్ లాంటిది. అలాగే, భద్రతా పరంగా చాలా సున్నితమైన ప్రదేశం కూడా. న్యూస్18కి అందిన సమాచారం మేరకు సీఆర్పీఎఫ్ జవాన్లు తమ విధులను ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో మిలిటెంట్లు వారి వాహనం మీద గ్రెనేడ్ దాడి చేశారు.
మరోవైపు ఆర్మీ, కుల్గాం పోలీసులు నిర్వహించిన ఓ జాయింట్ ఆపరేషన్‌లో ఖాజీగండ్‌లో ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేశారు. వారిద్దరూ అక్నూర్ జమ్మూ నుంచి వస్తున్న ఓ ట్రక్కులో ప్రయాణిస్తుండగా, భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఇద్దరు నిందితులు భారీ ఎత్తున ఆయుధాలను తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో ఆ ట్రక్కును ఆపేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. అలాగే, ట్రక్కులో తనిఖీ చేయగా భారీగా ఆయుధాలు పట్టుబడ్డాయి. వారి వద్ద దొరికిన ఆయుధాల్లో అమెరికా తయారు చేసే M4 రైఫిల్, ఏకే 47 రైఫిల్, నాలుగు పిస్టల్స్, కొన్ని రౌండ్ల బులెట్స్ కూడా ఉన్నాయి. వారిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు వాటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే సమాచారం కోసం మరింతగా విచారిస్తున్నారు. పోలీసులు, ఆర్మీ నిర్వహించిన ఇంకో జాయింట్ ఆపరేషన్‌లో మరో ఇద్దరు మిలిటెంట్లను కూడా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఓ పిస్టల్, నాలుగు గ్రెనేడ్లు, కొన్ని బులెట్స్ స్వాధీనం చేసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jammu and Kashmir, Terror attack