Home /News /national /

MILIND TELTUMBDE AMONG 26 MAOISTS KILLED AND 3 JAWANS INJURED IN GYARAPATTI GADCHIROLI ENCOUNTER MAHARASHTRA POLICE ANNOUNCED MKS KMM

encounter : మావోయిస్టులకు భారీ షాక్ -మరో అగ్రనేత తేల్తుంబ్డే సహా 26మంది హతం -Gadchiroli తాజా అప్‌డేట్స్

గడ్చిరోలి ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత తేల్తుంబ్డే హతం

గడ్చిరోలి ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత తేల్తుంబ్డే హతం

మావోయిస్టు పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే అగ్రనేతలు హరిభూషణ్, ఆర్కే అనారోగ్యంతో మృతి చెందగా, ఇప్పుడు మరో అగ్రనేత, మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడైన మిలింద్ తేల్తుంబ్డే అలియాస్ దీపక్ తేల్తుండే కూడా నేలకొరిగారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో శనివారం జరిగిన ఎన్ కౌంటర్ లో తేల్తుంబ్డేతోపాటు 26 మంది నక్సల్స్ చనిపోయారు. సమగ్ర వివరాలివి..

ఇంకా చదవండి ...
ఆకు పచ్చ అడవిలో ఎర్రటి నెత్తుటేరులు పారాయి.. సాయుధ పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పుల్లో భారీగా ప్రాణనష్టం జరిగింది. మావోయిస్టు పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే అగ్రనేతలు హరిభూషణ్, ఆర్కే అనారోగ్యంతో మృతి చెందగా, ఇప్పుడు మరో అగ్రనేత, మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడైన మిలింద్ తేల్తుంబ్డే అలియాస్ దీపక్ తేల్తుండే కూడా నేలకొరిగారు. ఇటీవల కాలంలో నక్సల్స్ పై తొలిసారి ఆధిపత్యాన్ని సాధించారు మహారాష్ట్ర పోలీసులు. మావోయిస్టులకు గట్టి పట్టున్న గడ్చిరోలి జిల్లాలో శనివారం జరిగిన భీకర ఎన్ కౌంటర్ లో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఓకేసారి 26 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటనపై గడ్చిరోలి ఎస్పీ అకింత్ గోయల్ అధికారికంగా ప్రకటించిన వివరాలివి..

అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే మరణం తర్వాత దూకుడు పెంచిన కేంద్ర, రాష్ట్ర బలగాలు.. దండకారణ్యం, ఏవోబీల్లో పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మావోయిస్టుల పాలనలోని దండకారణ్యంలో కీలకమైన తొమ్మిది డివిజన్లలో ఒకటైన గడ్చిరోలిలో ఆ పార్టీకి తీరని నష్టం వాటిల్లింది. ఆర్కే మరణం తర్వాత తెలంగాణలోని ములుగులో పోలీసుల ఎన్ కౌంటర్ లో ముగ్గురు కీలక నేతలు చనిపోవడం, ఉత్తరాదిలో పలువురు సీనియర్ నేతలను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకోవడం లాంటి ఘటనలు చోటుచేసుకోగా, ఇప్పుడు శరాఘాతం లాగా మహారాష్ట్రలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.

మహారాష్ట్ర పోలీస్ శాఖలోని సీ-60 విభాగానికి చెందిన సాయుధ బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎన్ కౌంటన్ చోటుచేసుకుంది. ఛత్తీస్ గఢ్ సరిహద్దును ఆనుకుని ఉండే మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ధరిరా తాలూకా లోని గ్యారబట్టీ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ కౌంటర్ కొనసాగిందని, ఈ ఘటనలో మొత్తం 26 మంది మావోయిస్టులు చనిపోయారని, ముగ్గురు పోలీసులు గాయపడ్డారని గడ్చిరోలి జిల్లా ఎస్పీ అకింత్ గోయల్ శనివారం సాయంత్రం మీడియాకు తెలిపారు. కాగా, ఎన్ కౌంటర్ లో చనిపోయినవారిలో మావోయిస్టు కీలక నేత మిలింద్ తేల్తుంబ్డే కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మిలింద్ అలియాస్ దీపక్ తేల్తుంబ్డే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో సభ్యులుగా ఉన్నారు. సంచలన బీమా కోరేగావ్ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తోన్న మిలింద్ తలపై ఎన్ఐఏ రివార్డు కూడా ప్రకటించడం తెలిసిందే.

చలికాలం సమీపిస్తుండటంతో మహారాష్ట్ర పోలీసులు మావోయిస్టుల వేటను ముమ్మరం చేశారు. ఈక్రమంలోనే గడ్చిరోలిలోని గ్యారబట్టి అటవీ ప్రాంతంలో బలగాలు శనివారం కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారని, ప్రతిగా తాము కూడా ఎదురుకాల్పులు జరిపామని, కొన్ని గంటలపాటు ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయని, చివరికి కాల్పులు ఆగిన తర్వాత ఆ ప్రాంతంలో మొత్తం 26 మృతదేహాలను గుర్తించామని పోలీసులు చెప్పారు. ఎన్ కౌంటర్ లో పారిపోయిన ఇతర మావోయిస్టుల కోసం గాలిస్తున్నామన్నారు.

గడిచిన కొద్ది నెలల్లో ఛత్తీస్ గఢ్ లోని పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలపై మావోయిస్టులు పై చేయి సాధించడం, ఏప్రిల్ లో జరిగిన బీజాపూర్ ఎన్ కౌంటర్ లో 22 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం, 2017లో చింతగుహ ప్రాంతంలో నక్సల్స్ చేతిలో 25 మంది జవాన్లు బలి కావడం, 2010లో దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు జరిపిన దాడిలో ఏకంగా 75 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు నేలకొరగడం తెలిసిందే. ఛత్తీస్ గఢ్ వెలుపల చోటుచేసుకున్న భారీ ఎన్ కౌంటర్ గడ్చిరోలిలో ఇవాళ జరిగిన ఘటనే అని తెలుస్తోంది. 26 మంది పార్టీ శ్రేణుల మృతిపై మావోయిస్టులు ప్రకటన చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే,

దివంగత మావోయిస్టు నేత ఆర్కేకు సంబంధించి హైదరాబాద్ లో పెను కలకలం చోటుచేసుకుంది. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్కే జీవిత చరిత్రను ముద్రిస్తున్న ప్రింటింగ్‌ ప్రెస్‌పై పోలీసులు దాడి చేశారు. నిషేధిత సాహిత్యంతో పుస్తకం ముద్రిస్తున్నారనే అభియోగంపై.. నవ్య ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమాని రామకృష్ణారెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
Published by:Madhu Kota
First published:

Tags: Encounter, Maharashtra, Maoist, Maoists, Naxals, Police

తదుపరి వార్తలు