రావమ్మా చీరపెడతా... ట్రంప్ భార్య మెలానియాకు స్పెషల్ గిఫ్ట్...

12వ శతాబ్దంలో సోలంకి వంశ రాజు కుమారపాల్ ఈ పటోలా చీరను ధరించి పూజలు చేసేవారట.

news18-telugu
Updated: February 23, 2020, 3:54 PM IST
రావమ్మా చీరపెడతా... ట్రంప్ భార్య మెలానియాకు స్పెషల్ గిఫ్ట్...
ట్రంప్, మెలానియా ట్రంప్, (పటోలా చీర)
  • Share this:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు రానున్నారు. ఈనెల 24, 25 తేదీల్లో వారు భారత్‌లో పర్యటించనున్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు లాంటి భారతదేశానికి తొలిసారి వస్తున్న అమెరికా అధ్యక్ష దంపతులకు అదేస్థాయిలో ఆతిథ్యం కల్పించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్యకు బహుమతిగా ఇచ్చేందుకు ఓ అరుదైన చీర సిద్ధమైంది. అదే పటోలా చీర.

పటోలా చీర ప్రత్యేకతలు ఏంటి?

పటోలా చీర అంటే గుజరాత్ సంస్కృతిలో ఓ భాగం. పటోలా చీర అంటే... ఆ పేరులోనే ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆ చీరను పూర్తిగా చేత్తోనే నేస్తారు. నలుగురు నుంచి ఆరుగురు సభ్యుల బృందం సుమారు ఆరు నెలల పాటు కష్టపడితే ఒక్క చీరను తయారు చేయగలరు. ఈ చీరలో ఉపయోగించే రంగులు అన్నీ సహజమైనవే. చెట్ల నుంచి సేకరించిన సహజమైన రంగులనే అందులో వినియోగిస్తారు. స్వచ్ఛమైన పట్టును ఉపయోగిస్తారు. ప్రపంచంలో ఎక్కడ పటోలా చీర కనిపించినా అది కచ్చితంగా గుజరాత్‌లో తయారు చేసినదే. ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఆ చీర మెరుగు తగ్గదు. ఉతికినా రంగు వెలిసిపోదు. ఈ పటోలా చీరకు సుమారు 900 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ తరహా చీరల తయారీకి ప్రత్యేకంగా ఎలాంటి ఇండస్ట్రీ లేదు. పఠాన్‌లోని సాల్వి కుటుంబమే ఈ చీరను తయారు చేస్తోంది. సుమారు 30 తరాల నుంచి ఆ కుటుంబం ఈ పటోలా చీరల తయారీలో ఉంది.

పటోలా చీర


మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ లాంటి వారికి గతంలో పఠాన్‌కు ఆహ్వానం అందింది. నరేంద్ర మోదీ గుజారత్ సీఎంగా ఉన్న సమయంలో పఠాన్‌లో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సాల్వి కుటుంబాన్ని వరించాయి. గతంలో ఇండొనేసియా, మలేసియాలకు ఈ పటోలా చీరలు అత్యధికంగా ఎగుమతి అయ్యేవి. గత ఏడాదిగా విదేశాల నుంచి ఈ చీరకు ఆర్డర్స్ వస్తున్నాయి.

పటోలా చీర తయారీ


12వ శతాబ్దంలో సోలంకి వంశ రాజు కుమారపాల్ ఈ పటోలా చీరను ధరించి పూజలు చేసేవారట. అప్పట్లో అలాంటి చీరలను మహారాష్ట్రలోని జల్నాలో తయారు చేసేవారు. దీంతో సుమారు 700 మంది నేత కార్మికులను పిలిపించిన రాజా కుమారపాల్ పఠాన్‌లో ఆశ్రయం ఇచ్చారు. ఆ తర్వాత అది పఠాన్ పటోలాగా ఖ్యాతిగాంచింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: February 23, 2020, 3:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading