హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Mission Paani: నిజంగా జలదూతే.. లక్షలాది మందికి నీటి కష్టాలను లేకుండా చేసిన మాజీ సైనికుడు

Mission Paani: నిజంగా జలదూతే.. లక్షలాది మందికి నీటి కష్టాలను లేకుండా చేసిన మాజీ సైనికుడు

మాజీ కల్నల్ దల్వీ (ఫైల్ ఫొటో)

మాజీ కల్నల్ దల్వీ (ఫైల్ ఫొటో)

ప్రజల దాహార్తినే తీర్చడానికి ఓ మాజీ సైనికుడు తన జీవితాన్ని ధారపోస్తున్నాడు. తనకు తెలిసిన మెలకువలతో ప్రజలను చైతన్య పరిచి ఎన్నో వందల గ్రామాల దాహార్తిని తీరుస్తున్నారు. ఆయనే మాజీ కల్నల్ దల్వీ. ఇంతకీ ఆయన ఏం చేశారంటే..

భారతదేశంలో ఇప్పటికీ తాగు నీటి వ్యవస్థ సరిగా లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. కిలో మీటర్ల కొద్దీ నడిచి వెళ్లి బిందెల్లో మంచినీటిని తెచ్చుకుని పొదుపుగా వాడుకునే ఊళ్లు లెక్కకు మించి ఉన్నాయి. ఎండాకాలం వచ్చిందంటే ఇక ఆ సమస్య మరింత తీవ్రం అవుతుంది. మంచినీళ్లే ప్రియంగా మారిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. మంచినీరు లేకనే కాదు, ఆ మంచినీటి కోసం జరిగిన గొడవల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. వర్షాలు వచ్చినా, ఆ నీరు భూముల్లో ఇంకిపోయి కొద్ది నెలలకే మళ్లీ కరువు తాండవిస్తుంటుంది. దీన్ని నివారించాలంటే వర్షపు నీటిని ఒడిసిపట్టుకుని దాచుకుని వాడుకోవడమే ఇప్పటికీ ఎప్పటికీ ఉన్న ఏకైక మార్గం. కానీ గ్రామాల్లో వీటి గురించి అవగాహన లేక ప్రజలు ఇంకా మంచి నీటి సంక్షోభంలోనే చిక్కుకుని ఉంటున్నారు. అయితే ప్రజల దాహార్తినే తీర్చడానికి ఓ మాజీ సైనికుడు తన జీవితాన్ని ధారపోస్తున్నాడు. తనకు తెలిసిన మెలకువలతో ప్రజలను చైతన్య పరిచి ఎన్నో వందల గ్రామాల దాహార్తిని తీరుస్తున్నారు. ఆయనే మాజీ కల్నల్ దల్వీ.

తాగు, సాగు నీటి సంక్షోభం తీవ్రంగా ఉండే రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఉంది. మహారాష్ట్రలోని ప్రధాన నగరమైన పూణెలో కూడా నీటి కరువు తాండవించింది. 2000 వ నుంచి ఆ రాష్ట్ర ప్రజలు నీటికి చాలా ఇబ్బందులు పడ్డారు. 2007 వ సంవత్సరం నుంచి కొత్తగా నిర్మించబోయే భవనాలన్నింటికీ వర్షపునీటిని నిల్వ చేసుకునేలా ఇంకుడు గుంతల ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనను కూడా పుణె మున్సిపల్ కార్పొరేషన్ పెట్టిందంటే పరిస్థితి ఎలా ఉండేదో మీరే అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలోనే భారతదేశంలో నీటి నిల్వలను పెంపొందిచేందుకు రూపొందించిన క్లైమెట్ రియాలిటీ ప్రాజెక్ట్ కు కల్నల్ దల్వీ జాతీయ కోఆర్డినేటర్ గా నియమితులయ్యారు.

‘వర్షం వచ్చినప్పుడు మన ఇళ్ల మీద నుంచి కిందకు వెళ్లి పోయే నీళ్లను మనం చూస్తూ ఉండిపోతాం. కానీ వాటిని ఒడిసి పట్టుకుని దాచుకుని వాడుకోవడం గురించి ఆలోచించరు. మన నిర్లక్ష్యమే మనకు శత్రువుగా మారి నీటి సంక్షోభాన్ని తెస్తోంది. నీతిఆయోగ్ అందించిన లెక్కల ప్రకారం భారత్ లో 60 కోట్ల మంది ప్రజలు నీటికరువును ఎదుర్కొంటున్నారు.‘ అని దల్వీ న్యూస్ 18 కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

‘నేను ఈ ప్రాజెక్టుకు ఆధ్వర్యం వహించినప్పుడు పూణెలో వర్షపాతం కేవలం 750 మిల్లీమీటర్లు మాత్రమే ఉండేది. అదే పక్కనే ఉన్న ముంబై నగరంలో మాత్రం ఏకంగా 2500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యేది. ఈ లెక్కల ప్రకారం పూణెలో వెయ్యి చదరపు అడుగుల వైశాల్యం ఉన్న ఓ ఇంటి పైకప్పు ఏడాదికి అరవై వేల లీటర్ల నీటిని సేకరించగలదు. అదే సమయంలో ముంబైలో అయితే ఏకంగా రెండు లక్షల 50వేల లీటర్ల నీటిని సేకరించవచ్చు. అయితే ముంబై, పుణెలు నగరాలు. భూగర్భ జలంపై ఈ నగరాలు ఎక్కువగా ఆధారపడలేవు. డ్యాములపైనే ఆధారపడి బతకాలి. వర్షాకాలంలో కాలువల ద్వారా నీటినీ ఈ నగరాల నుంచి వర్షపు నీటిని డ్యాముల్లోకి మళ్లించాలి. ఈ డ్యాములకు కూడా ఒక పరిమితి ఉంది. పరిమితికి మించితే మిగిలిన నీటిని వృథాగా సముద్రంలోకి వదిలివేయాల్సిందే. అందుకే ప్రజలందరికీ సరిపడా నీటిని అందించలేకపోతున్నాం. డబ్బున్న వాళ్లయితే ప్రైవేటు ట్యాంకర్లతో నీటిని కొంటారు. పేదలు మాత్రమే అంతిమంగా నష్టపోతున్నారు‘ అని దల్వీ వివరించారు.

అయితే దల్వీ కృషితో మెజారిటీ గ్రామాల్లో నీటి కరువు సంక్షోభం తీరిపోయింది. వర్షపు నీటిని దాచుకోవడంపై ఆయన ప్రజల్లో అవగాహన పెంచారు. ఆ ప్రయత్నాలు ఫలించి మొత్తానికి ఎన్నో వందల గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు తొలగిపోయాయి. కామ్ ఖేదా గ్రామంలో అయితే ప్రజల అవసరాలన్నీ తీరిపోయి గ్రామంలో చెట్లకు కూడా నీటిని పెట్టగలిగేంత నీటి లభ్యత ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ గ్రామంలో దల్వీని జలదూత అని, రైన్ మ్యాన్ అనీ పిలుస్తుంటారంటే ఆయన చేసిన కృషి ఎంతటి ప్రభావం చూపిందో వేరే చెప్పనవసరం లేదు.

First published:

Tags: Save water, Water conservation, Water harvesting

ఉత్తమ కథలు