పెళ్లి ఇష్టంలేక ఇంటి నుంచి పారిపోయి.. ప్రభుత్వ ఉద్యోగంతో తిరిగొచ్చింది..

ఇంకా బాగా చదివి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయాలనుకుంటున్నట్టు సంజూ రాణి చెబుతోంది. డివిజనల్ మేజిస్ట్రేట్ కావడం తన లక్ష్యమని వివరిస్తోంది.

news18-telugu
Updated: September 16, 2020, 1:38 PM IST
పెళ్లి ఇష్టంలేక ఇంటి నుంచి పారిపోయి.. ప్రభుత్వ ఉద్యోగంతో తిరిగొచ్చింది..
సంజు రాణి వర్మ
  • Share this:
ఆ యువతి బాగా చదువుకుని ఉన్నతోద్యోగం చేయాలని కలలు కనేది. అందుకు తగ్గట్టే చదువుల్లో ముందుండేది. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆమె కలలను తలకిందులు చేశాయి. అనుకోని పరిస్థితుల కారణంగా పెళ్లి చేసుకోవాలని బంధువులు ఒత్తిడి చేయడంతో ఇంట్లో నుంచి పారిపోయింది. ఏడేళ్ల తరువాత ప్రభుత్వ ఉద్యోగంతో తిరిగి ఇంటికి వెళ్లింది. యూపీలోని మీరట్‌కు చెందిన 35ఏళ్ల సంజు రాణి వర్మ విజయగాథ ఇది.

అమ్మాయిల చదువుకు అవకాశం లేని కుటుంబంలో పుట్టింది సంజు రాణి. చిన్నప్పటి నుంచి చదువుకోవడానికి ఎన్నో అవరోధాలు ఎదుర్కొంది. ఆర్థిక పరిస్థితులు అంతతమాత్రమే. అయినా పట్టుబట్టి మరీ పీజీలో చేరింది. దిల్లీ యూనివర్సిటీలో పీజీ చదువుతుండగా ఆమె తల్లి మరణించింది. అప్పటి నుంచి ఆమెను సమస్యలు చుట్టుముట్టాయి. చదివింది చాలని, ఇక పెళ్లి చేసుకోవాలని బంధువులు ఒత్తిడి చేశారు. కానీ రాణి ఒప్పుకోలేదు. కుటుంబ ఒత్తిళ్లను భరించలేక 2013లో ఇంటి నుంచి పారిపోయింది. అప్పటి నుంచి మరింత కష్టపడి చదివింది. తాజాగా పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించిన పరీక్షలో ప్రతిభ చాటి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించింది. తన కల నెరవేరిన తరువాత ఏడేళ్ల అనంతరం ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలుసుకుంది.

మీరట్‌లోని ఆర్జీ డిగ్రీ కళాశాలలో ఆమె డిగ్రీ పూర్తిచేసింది సంజూ రాణి. అప్పుడే కెరీర్‌కు కచ్చితమైన ప్రణాళిక వేసుకుంది. కానీ ఆమెకు కుటుంబం నుంచి మద్దతు కరవైంది. 2013లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది సంజు రాణి. 28ఏళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆర్థిక సహాయం లేకపోవడంతో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకుని ప్రైవేట్ ట్యూషన్ క్లాసులు చెప్పింది. ప్రైవేట్ సంస్థలలో పార్ట్ టైమ్ టీచింగ్ ఉద్యోగాలు కూడా వచ్చాయి. కానీ ఆమె మాత్రం పీఎస్సీ పరీక్షే లక్ష్యంతో ముందుకు సాగింది. యుపీపీఎస్సీ -2018 పరీక్షరాసింది. ఆ పరీక్ష ఫలితాలు గత వారం ప్రకటించారు. దాంట్లో ఆమె వాణిజ్య పన్నుల అధికారిగా ఎంపికైంది.

తాను ఇంకా బాగా చదివి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయాలనుకుంటున్నట్టు సంజు రాణి చెబుతోంది. డివిజనల్ మేజిస్ట్రేట్ కావడం తన లక్ష్యమని వివరిస్తోంది. ఆడపిల్లకు చదువెందుకు అని విమర్శించిన కుటుంబ సభ్యులే ఇప్పుడు ఆమెను అభినందిస్తున్నారు. ఆమె కూడా జీవితాంతం తన కుటుంబానికి అండగా ఉంటానని చెబుతోంది. ఇప్పుడైనా ఆడపిల్లలను చదువుకునేలా ప్రోత్సహిస్తారని ఆమె ఆశిస్తుంది. ఆడవాళ్లు ఎప్పుడూ మగవారి చేతికిందనే ఉండాలనే సమాజ ధోరణిని రాణి మార్చిందని ఆమెకు బడిలో పాఠాలు చెప్పిన ఒక ఉపాధ్యాయుడు సంతోషం వ్యక్తం చేశారు.
Published by: Shiva Kumar Addula
First published: September 16, 2020, 1:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading