ఢిల్లీ మేయర్ ఎన్నిక (Delhi Mayor Elections) వాయిదా పడింది. ఆమాద్మీ, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో కొట్లాట జరగడంతో.. ఎంసీడీ మేయర్ (MCD Mayor) ఎన్నిక జరగకుండానే సమావేశం ముగిసింది. ఇవాళ ఉదయం మేయర్ ఎన్నిక కోసం సమావేశమైన ఢిల్లీ మున్పిపల్ కార్పొరేషన్ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించిన సభ్యుడిని కాకుండా.. వేరొక సభ్యుడిని ప్రిసైడింగ్ స్పీకర్‌గా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నియమించడంపై ఆమాద్మీ కౌన్సిలర్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రొటెం స్పీకర్ సత్య శర్మను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సభ్యులెవరీనీ ప్రమాణస్వీకారం చేయనీయలేదు. ఈ క్రమంలో బీజేపీ (BJP), ఆమాద్మీ (AAP) వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కొందరు సభ్యులు మైకులు, కుర్చీలను విరగొట్టారు. ఈ ఘటనలో కొందరు సభ్యులకు గాయాలయినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో మేయర్ ఎన్నిక నిర్వహించకుండానే సభ వాయిదా పడింది.
Delhi Mayor Polls | Amid chaos & clash between AAP, BJP councillors, MCD house adjourned before the commencement of voting for mayor elections. pic.twitter.com/9DwrROvzKw
— ANI (@ANI) January 6, 2023
డిసెంబరులో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమాద్మీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 15 ఏళ్ల పాటు ఢిల్లీ నగరాన్ని ఏలుతున్న బీజేపీని ఆమాద్మీ ఓడించింది. మొత్తం 250 స్థానాలకు గాను.. 134 స్థానాల్లో ఆప్ అభ్యర్థులు గెలిచారు. బీజేపీ 104 స్థానాలకే పరిమితమయింది. కాంగ్రెస్ కేవలం 9 సీట్లతో సరిపెట్టుకుంది. ఎక్కువ సీట్లలో గెలిచినందున మేయర్ పీఠం తమకే వస్తుందని ఆమాద్మీ ధీమాగా ఉంది. తమ పార్టీ తరపున షెల్లీ ఒబెరాయ్‌ని మేయర్ అభ్యర్థిగా నిలబెట్టింది. తమకు తగినంత బలం లేనప్పటికీ.. బీజేపీ కూడా మేయర్ ఎన్నికల్లో పోటీకి దిగింది. బీజేపీ తరపున రేఖా గుప్తా పోటీలో ఉన్నారు.
ఐతే.. మేయర్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ సభ్యుడైన ముకేశ్ గోయెల్‌ను ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించింది. సీనియర్ సభ్యుడినే ప్రొటెం స్పీకర్‌గా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. ఐతే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా మాత్రం ముకేశ్ గోయెల్‌ని కాకుండా.. సత్య శర్మను ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. ఆయన సభలోకి చేరుకొని.. కౌన్సిలర్‌ల ప్రమాణస్వీకారాన్ని ప్రారంభించారు. ఇంతలోనే ఆమాద్మీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి.. ఆందోళన చేశారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరించేందుకే సత్యశర్మను ప్రొటెం స్పీకర్‌గా నియమించారని మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. బీజేపీ కుట్రపూరితంగానే మేయర్ ఎన్నికల్లో పోటీచేస్తోందని.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఆమాద్మీ విమర్శలు గుప్పిస్తోంది.
ఐతే ఎన్నికల్లో పోటీ చేయడం తప్పేమీ కాదని.. ఆమాద్మీ, కాంగ్రెస్ సభ్యులు కూడా తమకే మద్దతు తెలపవచ్చని బీజేపీ చెబుతోంది. అటు కాంగ్రెస్ మాత్రం.. తాము ఎవరికీ మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసింది. తదుపరి మేయర్ ఎన్నిక తేదీని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ త్వరలోనే ప్రకటించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.