ఢిల్లీ(New Delhi)లో చీపురుకు తిరుగులేదని మరోసారి నిరూపితమైంది. మున్సిపల్ కార్పొరేషన్ (Municipal corporation of Delhi) ఎన్నికల్లోనూ ఆమాద్మీ పార్టీ సత్తా చాటింది. బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టి.. 15 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి బ్రేక్‌లు వేసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD Polls) ఎన్నికల్లో ఆమాద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 250 వార్డుల్లో ఆమాద్మీ పార్టీ 134 సీట్లు కైవసం చేసుకుంది. బీజేపీ 104 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేదు. కేవలం 9 సీట్లతో సరిపెట్టుకుంది. మరో మూడు చోట్ల ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ఢిల్లీ అసెంబ్లీలో ఆమాద్మీ ప్రభుత్వం ఉన్నప్పటికీ.. గత ఎన్నికల్లో మాత్రం బీజేపీ గెలిచింది. గత 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పీఠంపై కమలం నేతలే ఉన్నారు. కానీ బీజేపీ ఏకఛత్రాధిపత్యానికి చెక్ పెడుతూ.. ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆమాద్మీ కైవసం చేసుకుంది.
గతంలో ఢిల్లీలో మూడు కార్పొరేషన్లు ఉండేవి. అవి నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఈస్ట్ ఢిల్లీ కార్పొరేషన్. గతంలో ఈ మూడింటిలో కలిపి 270 వార్డులు ఉండేవి. ఐతే మూడు కార్పొరేషన్లను ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చి.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌గా మార్చేశారు. వార్డుల సంఖ్యను కూడా తగ్గించారు. గతంలో 270 ఉంటే.. ఇప్పుడా సంఖ్య 250గా ఉంది.
పాత వాటితో పోల్చితే.. ప్రస్తుత ఫలితాలు:
పాత నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 94 వార్డులున్నాయి. అందులో ఆమాద్మీ పార్టీ 56 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 36 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ 1, ఇండిపెండెట్లు ఒక సీటును కైవసం చేసుకున్నారు.
పాత సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 95 వార్డులున్నాయి. అందులో ఆమాద్మీ పార్టీ 58 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 33 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ మూడు, ఇండిపెండెట్లు ఒక సీటును కైవసం చేసుకున్నారు.
పాత ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 61 వార్డులున్నాయి. అందులో ఆమాద్మీ పార్టీ 20 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 35 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ 5, ఇండిపెండెట్లు ఒక సీటును కైవసం చేసుకున్నారు.
పాత కార్పొరేషన్లతో పోల్చి చూస్తే.. ఒక్క ఈస్ట్ ఢిల్లీలో మాత్రమే బీజేపీ తన పూర్వ వైభవాన్ని చాటుకుంది. నార్త్, సౌత్ ఢిల్లీలో ఆమాద్మీ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించడంతో.. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకొని... మేయర్ పీఠాన్ని దక్కించుకుంది.
2017లో అప్పటి 270 మునిసిపల్ వార్డుల్లో 181 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా, ఆమాద్మీ పార్టీ 48 స్థానాల్లో మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ 30 స్థానాలతో సరిపెట్టుకుంది. కానీ ఈసారి ఫలితాలు పూర్తిగా తారుమారయ్యాయి. బీజేపీ కంచుకోటను ఆమాద్మీ బద్ధలు కొట్టి.. 15 ఏళ్ల ఏకచక్రాధిపత్యానికి బ్రేకులు వేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.