తాజా ఎన్నికల్లో యూపీలో దారుణంగా దెబ్బతిన్న బీఎస్పీ ఏనుగును తిరిగి నిలబెట్టగలిగేలా పార్టీని కంట్రోల్ చేసే అంకుశం(మావటి ఆయుధం) లాంటి పగ్గాలను మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ కు అప్పగించారు అధినేత్రి మాయావతి.
వయసు, ఆరోగ్య సమస్యలు తదితర కారణాలతో చురుకుగా ఉండలేకపోతున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి పార్టీలో తిరిగి జోష్ నింపే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురై, 403 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం ఒకేఒక్క సీటును దక్కించుకున్న దరిమిలా మాయావతి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. బీఎస్పీ ఏనుగును తిరిగి నిలబెట్టగలిగేలా పార్టీని కంట్రోల్ చేసే అంకుశం(మావటి ఆయుధం) లాంటి పగ్గాలను మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ కు అప్పగించారు. భీమ్ ఆర్మీ చంద్రశేఖర్ రావణ్‌ను నిలువరించగల సత్తా అల్లుడు ఆకాశ్ కే ఉన్నట్లు మాయ విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది.
బీఎస్పీ తిరిగి నిలబెట్టుకునే క్రమంలో మాయవతి నమ్మకస్తులు, కుటుంబీకులకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇందులో భాగంగానే సంస్థాగతంగా మాయావతి పార్టీలో కీలక మార్పులు చేశారు. కుటుంబీకులకు రెండు కీలక పదవులు కట్టబెట్టారు. మాయ తన చిన్న తమ్ముడు ఆనంద్ కుమార్ ను 2019లోనే బీఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడుగా చేయగా, ఇప్పుడాయన బాధ్యతలను పెంచారు. అన్నిటికంటే ప్రధానంగా..
యూపీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత మాయవతి బీఎస్పీలో చేపట్టిన భారీ మార్పు.. అల్లుడు ఆకాశ్ ఆనంద్ కు అంకుశాన్ని అప్పగించడం. మాయావతి రాజకీయ వారసుడిగా పేరుపొందిన ఆకాశ్ కొన్నేళ్లుగా సంయుక్త జాతీయ సమన్వయకర్తగా ఎంపీ రామ్‌జీ గౌతమ్‌తో పదవిని పంచుకున్నారు. అయితే ఇప్పుడు మాయ.. రామ్ జీ గౌతమ్ ను తప్పించేసి, బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ పూర్తి బాద్యతలను అల్లుడు ఆకాశ్ కు అప్పగించారు. యువకుడైన ఆకాశ్.. బీఎస్పీకి ముల్లులా తయారైన భీమ్ ఆర్మీని నిలువరించగలడని మాయ విశ్వసిస్తున్నారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ బీఎస్పీకి గట్టి పోటీ ఇచ్చారు. బీఎస్పీ ఓట్ బ్యాంకును లాగేసుకున్నారు. దీంతో మాయావతి తిరిగి తన ఓటు బ్యాంకును రాబట్టే పనిలో ఇప్పటి నుంచే నిమగ్నమయ్యారు. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌కు గట్టి పోటీ ఇవ్వడానికి తన అల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను రంగంలోకి దింపారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకులను పార్టీ వైపు తిప్పాలని సూచించారు. అంతేకాకుండా ఓ 150 మంది ఎస్సీ యువకులను తీసుకొని, పార్టీ సోషల్ మీడియా బాధ్యతలు కూడా చూసుకోవాలని, ఇప్పటి నుంచే సోషల్ మీడియాను యాక్టివ్ చేయాలని బీఎస్పీ చీఫ్ మాయావతి ఆదేశించారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.