హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

గిరిజనంపై యుద్ధమేఘం.. పట్టు సాధిస్తున్న మావోయిస్టులు.. అండగా లోకల్‌ మిలీషియా.. బాణాలే ఆయుధాలుగా పోరాటం..

గిరిజనంపై యుద్ధమేఘం.. పట్టు సాధిస్తున్న మావోయిస్టులు.. అండగా లోకల్‌ మిలీషియా.. బాణాలే ఆయుధాలుగా పోరాటం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ-చత్తీస్‌ఘడ్-ఆంధ్ర- ఒడిషా బోర్డర్‌గా ఉన్న సుదీర్ఘ సరిహద్దు ప్రాంతమైన దండకారణ్యంలో మరోసారి మావోయిస్టులు పట్టు సాధిస్తున్నారా..? స్థానిక గొత్తికొయలు, ఆదివాసీ గిరిజనంలో వారి పలుకుబడిని క్రమంగా పెంచుకుంటున్నారా..? అంటే వరుసగా జరుగుతున్న ఘటనలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి

ఇంకా చదవండి ...

(జి. శ్రీనివాసరెడ్డి, ఖమ్మం, న్యూస్‌18 తెలుగు)

వ్యూహాత్మకంగా కీలకమైన మావోయిస్టు నేతలు పెద్దగా ఎక్సేంజ్‌ ఆఫ్‌ ఫైర్‌లో పాల్గొనే పరిస్థితి ఉండదు.. వాళ్లు వ్యూహరచన చేసి.. అమలు చేసే బాధ్యతను మాత్రం టాస్క్‌ కమాండోకు వదిలేస్తారు.. దాన్ని ఎంతకాలానికైనా పక్కాగా స్కెచ్‌ ప్రకారం అమలు చేసి చూపాల్సింది సంబంధిత కమాండ్‌ మాత్రమే.. అయితే ప్రతి చిన్న చిన్న టాస్క్‌లను సుశిక్షితులైన మావోయిస్టు టీం మెంబర్లు చేయడం ప్రమాదకరమని.. పదే పదే వారి రహస్య ఉనికి వెల్లడి కాకుండా ఉండేందుకు.. చిన్నచిన్న ఘటనలను అమలు చేసే బాధ్యతను మాత్రం మావోయిస్టు ఉద్యమం తరపున లోకల్‌ మిలీషియా తీసుకుంటుంది. ఈ మిలీషియాకు ఉన్న పరిమిత వనరులతోనే ఉద్యమ నేతలు ఏ టాస్క్‌ ఇచ్చారో దాన్ని తూచ తప్పకుండా అమలు చేస్తుంటారని తాజాగా చోటుచేసుకుంటున్న ఘటనలు వెల్లడిస్తున్నాయి.

ఈ ఏడాది ఏప్రిల్‌ నెల సాయుధ బలగాలకు అస్సలు కలసిరాలేదు. ఏప్రిల్‌ మొదటివారంలో చోటుచేసుకున్న ఓ మారణహోమం ఒకే ఘటనలో 22 మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని బలి తీసుకుంది. దీంతోబాటు జవాన్‌ రాకేశ్వర్‌సింగ్‌ను బందీగా పట్టుకోవడం.. జమ్ముకాశ్మీర్‌కు చెందిన ఆయన కుటుంబం వేడుకోలు.. మేథావులు.. పలు ప్రజాసంఘాలు.. హక్కుల సంఘాలు.. జర్నలిస్టుల సూచనలను పరిగణనలోకి తీసుకున్న మావోయిస్టులు మొత్తానికి అతన్ని ప్రజాకోర్టులో నిలబెట్టి విచారించి మరీ.. క్షమించి వదిలేశారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న పలు ఘటనలు పోలీసు ఉన్నతాధికారులను.. ఇటు ప్రజాసంఘాలు.. హక్కుల సంఘాల నేతలను సైతం ఆలోచనలో పడేశాలా ఉన్నాయి. జవాన్‌ రాకేశ్వర్‌సింగ్‌ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజాకోర్టుకు వందలాది మంది గిరిజనం హాజరుకావడం.. వారంతా ఎంతో వినమ్రంగా ఒకే పద్దతిలో కూర్చొని ఉండడం.. లాంటివి మావోయిస్టులకు స్థానిక గిరిజనంలో ఉన్న సానుభూతి.. మద్దతును తెలియజేస్తున్నట్టుగా ఉన్నాయని.. ఒకవేళ ఇలాంటి సందర్భాల్లో మావోయిస్టులు తమ ప్రాబల్యాన్ని చాటుకోవడానికి వాడుకుంటారని.. బందీగా పట్టుకున్న పోలీసు జవాన్‌ను విడుదల చేస్తూ.. గిరిజనంలో తమ ఉనికిని.. పట్టును పెంచుకోడానికి వ్యూహాత్మకంగా ఉపయోగించుకోడానికి ప్రయత్నించినట్టుగా ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. ఇలాంటి ఘటనలు ఆదివాసీ యువత నక్సల్‌ ఉద్యమం వైపు ఆకర్షితులవడానికి ఉపకరించే ప్రమాదం ఉందని పోలీసు అధికారులు భావిస్తున్నారు.

ఏప్రిల్‌ 3వ తేదీన చత్తీస్‌ఘడ్‌లోని బీజపూర్‌ జిల్లా జీరగూడెం, తొర్రెం అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న దారుణ మారణకాండను మరచిపోకముందే సాయుధ బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి మావోయిస్టులు వరుస దెబ్బలు తీస్తున్నారు. విరామం లేకుండా ఒకదాని వెంట ఒకటిగా ఘటనలకు పాల్పడుతున్నారు. దీంతో ఏరోజు ఏంజరుగుతుందోనన్న వ్యాకులత వ్యాప్తి చెందుతోంది. అదును చూసి సాయుధ బలగాలపై విరుచుకుపడిన ఈ మారణకాండ జరిగిన ఇదే గంగళూరు పోలీసుస్టేషన్‌ పరిధిలోని కామకనార్‌ అనే ఓ గిరిజన గ్రామంలో కరోనా వ్యాక్సిన్లు వేస్తున్న నలుగురు వైద్యారోగ్య మహిళా సిబ్బందిని మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. అయితే ఈ నలుగురు హెల్త్‌వర్కర్ల కిడ్నాప్‌ పై పలు రకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అంతకుముందు ఏప్రిల్‌ 3వ తేదీన చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో గాయపడిన మావోయిస్టులకు చికిత్స కోసం వీరిని కిడ్నాప్‌ చేశారా.. లేక కరోనా వ్యాక్సినేషన్‌ పేరుతో గిరిజనగూడేల్లో నక్సల్స్‌ ఆచూకీ కోసం పోలీసులు వీరిని పంపారేమోనన్న అనుమానంతోనూ వీరిని అపహరించి ఉండొచ్చన్న అనుమానాలు వస్తున్నాయి.

అనంతరం దంతెవాడ జిల్లాలోని నేతల్‌నార్‌కు చెందిన అసిస్టెంట్‌ కానిస్టేబుళ్లు పూనెం హర్మ, ధనిరాం కశ్యప్‌లు బెజ్జి దగ్గరిలోని ఓ గ్రామంలోని ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా.. అటకాయించి వారిని పదునైన ఆయుధాలతో కోసి చంపారు. దీంతో ఉలిక్కిపడడం పోలీసుల వంతయింది. తాజాగా.. ఆదివాసీ గిరిజన గూడేల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉద్దేశించిన ప్రధానమంత్రి సడక్ యోజన పనులను చేయడానికి వచ్చిన కాంట్రాక్టర్‌ను బెదిరించిన మావోలు.. అనంతరం ఆ పనులు ఆపకుండా చేస్తున్న ఆపరేటర్‌ను దారుణంగా హతమార్చారు. సుకుమా జిల్లాలోని చింతల్‌నార్‌- డోర్నపాల్‌ మార్గంలో ఈ ఘటన జరిగింది. ఇక్కడి గోర్గుండ గ్రామ పంచాయతీ పరిధిలోని కేంపు గ్రామంలో ఈ అభివృద్ధి పనులు జరుగుతుండగా నక్సల్స్‌ హెచ్చరించారు. అయినా లక్ష్యపెట్టకుండా పనులు నడిపిస్తుండడంతో ఆపరేటర్‌ భాస్కర్‌తో సహా మరో ఇద్దరిని పట్టుకెళ్లిన లోకల్‌ మిలీషియా సభ్యులు భాస్కర్‌ను బండరాయితో ముఖంపై కొట్టి.. బాణాలతో చంపారు. మిగిలిన వారిని మాత్రం వదిలేశారు. ఈ ఘటనను సుకుమా ఎస్పీ కే.ఎల్‌.ధృవ్‌ ఖండించారు. రహదారుల నిర్మాణంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టినా ఇలా అడ్డుకోవడంపై మావోయిస్టుల వ్యూహం స్పష్టమవుతోంది. పోలీసులు సులువుగా గిరిజన గూడేల్లోకి రాకుండా అడ్డుకోవడమే ఈ ఘటనల లక్ష్యమన్నది పోలీసుల భావన.

గతేడాది మూడు రాష్ట్రాల పోలీసు బాస్‌లతో కేంద్ర అంతర్గత భద్రత సలహాదారు కె.విజయ్‌కుమార్‌ ఇక్కడి వెంకటాపురంలో జరిపిన చర్చలు.. పన్నిన వ్యూహాల అనంతరం మావోయిస్టు ఉద్యమ తీవ్రత కొన్ని నెలల పాటు వెనుకకు పడినట్టు కనిపించినా.. ఈ మధ్య కాలంలో తమ ఉనికిని నిరూపించుకోడానికి ఎక్కడికక్కడ యాక్షన్‌ టీంలను సిద్ధం చేసి మారణకాండకు దిగడంతో పోలీసు అధికారులు సైతం తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఏటా వేసవిలో కనీస దూరంలో మనిషి కనిపించే పరిస్థితి పెరగడం.. దీన్ని అదనుగా చేసుకుని మావోయిస్టులపై పోలీసు బలగాలు విరుచుకుపడడం సాధారణం. కానీ ఈ వేసవి ఆరంభంలో సాయుధ బలగాలకు ఎదురుదెబ్బ తగలడంతో పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నట్టవుతోంది.

First published:

Tags: Andhra Pradesh, Chatisghad, Maoist, Odisha, Rakeshwar singh, Strenghts maoist in tribal

ఉత్తమ కథలు