Home /News /national /

MAOISTS KILLED 16 KURCHELI LOCALS LOCALS BIJAPUR DISTRICT OF CHATTISGARH SK

మావోయిస్టుల బీభత్సం.. ఒకే ఊరిలో 16 మంది దారుణ హత్య

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కుర్చేలి గ్రామానికి చెందిన 16 మంది వ్య‌క్తుల‌ను మావోయిస్టులు దారుణంగా హ‌త‌మార్చారు. మ‌రికొంత‌ మంది గ్రామ‌స్తుల‌ను కూడా నాలుగు రోజుల క్రితం మావోలు హ‌త్య చేశార‌ని స్థానికులు చెబుతున్నారు.

  ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మరోసారి నెత్తుటేరులు పారాయి. బస్తర్ డివిజన్‌లో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. ఇన్‌ఫార్మర్ల నెపంతో అమాయక గిరిజనులను చంపేస్తున్నారు. తాజాగా కుర్చేలి గ్రామానికి చెందిన 16 మంది వ్య‌క్తుల‌ను మావోయిస్టులు దారుణంగా హ‌త‌మార్చారు. మ‌రికొంత‌ మంది గ్రామ‌స్తుల‌ను కూడా నాలుగు రోజుల క్రితం మావోలు హ‌త్య చేశార‌ని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో బస్తర్ అడవుల్లోని గిరిజనులు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇక మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అన్యాయంగా తమ వారిని పొట్టన బెట్టుకున్నారని రోదిస్తున్నారు.

  కాగా, ఇలాంటి ఘ‌ట‌నే సెప్టెంబ‌ర్ 5వ తేదీన బీజాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లాలోని మోటాపోల్, పునాసార్ గ్రామాలకు చెందిన 25 మంది గిరిజనులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు.. వారిలో నలుగురిని అతి కిరాతకంగా గొంతుకోసి హతమార్చారు. దట్టమైన అడవుల్లోనే ప్రజాకోర్టు నిర్వహించి శిక్షలు విధించారు. నలుగురిని ఉద్యమ ద్రోహులుగా నిర్ధారిస్తూ.. కాళ్లుచేతులు కట్టేసి, గొంతుకోసి హత్య చేశారు. తమ కదలికలపై పోలీసులకు సమాచారం ఇచ్చే వారిందరికీ ఇదే గతి పడుతుందని గట్టిగా హెచ్చరించారు. మరో ఐదు మందిని తీవ్రంగా గాయపరిచి వదిలిపెట్టారు మావోయిస్టులు. వారు గ్రామాలకు చేరుకొని జరిగిన విషయం చెప్పడంతో.. మావోయిస్టుల ఘాతుకం వెలుగులోకి వచ్చింది. మరో ఐదుగురిని తీవ్రంగా కొట్టి విడిచిపెట్టారు. మిగిలిన 16 మంది ఇప్పటికే మావోయిస్టు చెరలోనే ఉన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు సహకరిస్తున్నారని, పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా పనిచేస్తున్నారన్న కారణంతో నక్సల్స్ ఘాతుకానికి పాల్పడ్డారు మావోయిస్టులు.

  ఇక తెలంగాణలోని ఏజెన్సీలో వరుస ఎన్‌కౌంటర్లు అక్కడి ప్రజల్లో వణుకుపుట్టిస్తున్నాయి. సెప్టెంబరు 23న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నాపురం అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. ఆ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా మొత్తం ముగ్గురు మావోయిస్టులు మరణించారు. సెప్టెంబరు 19న తెలంగాణలోని కొమ్రంభీమ్ అసిఫాబాద్ జిల్లాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని కడంబ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ప్రాణహిత నది సమీపంలో ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.

  అంతకుముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుసగా రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఒక ఘటనో ఇద్దరు, మరో ఘటనలో ఒక మావోయిస్టు చనిపోయాడు. అప్పటి నుంచి మావోయిస్టుల ఏరివేత కోసం కూంబింగ్ చేస్తున్నారు పోలీసులు. మహారాష్ట్ర సరిహద్దుతో పాటు ఛత్తీస్‌ఢ్ సరిహద్దుల్లోనూ ముమ్మరంగా గాలిస్తున్నారు. వరుస ఎన్‌కౌంటర్లలతో ఏజెన్సీలోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఏజెన్సీలో ఎప్పుడు ఏం జరుగుతుందోని ఆందోళన చెందుతున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Chhattisgarh, Maoist attack

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు