Lok Sabha Election 2019 : రెండో దశ ఎన్నికల్లో భాగంగా... ఒడిశాలోని 5 లోక్ సభ స్థానాలకు, 35 అసెంబ్లీ స్థానాలకూ ఎన్నికలు జరుగుతుండగా వాటిని అడ్డుకుంటామని హెచ్చరించిన మావోయిస్టులు హింసకు పాల్పడుతున్నారు. కంధమాల్ అడవి ప్రాంతంలో పోలింగ్ సిబ్బంది లక్ష్యంగా మందుపాతర పేల్చారు. ఆ దాడిలో పోలింగ్ ఏజెంట్ సంజుక్తా దిగల్ చనిపోయారు. కొంతమందికి గాయాలయ్యాయి. మావోయిస్టుల పని పట్టేందుకు కేంద్ర బలగాలు అక్కడ కూంబింగ్ జరుపుతున్నాయి. ఇదంతా చూస్తూ... అక్కడి జనం ఇళ్లలోంచి బయటకు రావాలంటే బయపడుతున్నారు. మావోయిస్టులు కోరుకుంటున్నది కూడా అదే. ఎలాగైనా ఎన్నికలకు ప్రజలు దూరంగా ఉండాలనే కుట్రపూరిత ఆలోచనలతో హింసకు తెగబడుతున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంత ఏకైక బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవీని కాల్చి చంపిన మావోయిస్టు కమాండర్‌ను కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. దౌలికర్క అడవుల్లో ఉదయం మావోయిస్టులు తిరుగుతున్నట్లు తెలియడంతో పోలీసులు కూంబింగ్ చేశారు. ఈ క్రమంలో అటు మావోయిస్టులు ఇటు DRG దంతెవాడ మధ్య హోరాహోరీ ఎదురుకాల్పులు జరిగాయి. ఓ మావోయిస్టు కమాండర్, మరో మావోయిస్టును మట్టుపెట్టారు. గాయపడిన మరో మావోయిస్టు దస్రును ఆస్పత్రికి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. IEDల ఎక్స్పర్ట్ అయిన వర్గీస్... పెట్టిన మందుపాతర పేలడంతో ఏప్రిల్ 9న ఎమ్మెల్యే భీమా మండవీ చనిపోయారు. శక్తిమంతమైన పేలుడుకి భీమా మాండవీ ప్రయాణస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఒక్కసారిగా గాల్లోకి లేవగా... భారీ పేలుడుకి మాండవీ శరీర భాగాలు చెల్లాచెరుగుగా ఎగిరిపడ్డాయి. ఈ దాడిలో ఆయనతోపాటూ... మరో ముగ్గురు భద్రతా సిబ్బంది, ఓ పోలీస్ డ్రైవర్ కూడా చనిపోయారు.
ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో 3 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిని బహిష్కరించిన మావోయిస్టులు ప్రజలెవ్వరూ ఓటు వెయ్యొద్దని పిలుపునిచ్చారు. ఆ క్రమంలో ప్రజలను భయపెట్టేందుకు అడవుల్లో తిరుగుతున్నట్లు తెలిసింది. తాజా కాల్పుల్లో ఘటనా స్థలం నుంచీ పోలీసులు... ఓ 315 బోర్ రైఫిల్, ఒక మజిల్ లోడింగ్ రైఫిల్, రెండు పేలుడు పదార్థాలు, నక్సల్స్ క్యాంపింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి :
తైవాన్‌లో భూకంపం... రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1 గా నమోదు...
10 రాష్ట్రాల్లో ప్రశాంతంగా పోలింగ్... బెంగాల్లో హింస, అసోంలో ఈవీఎంల మొరాయింపు
కుండలతో కూలర్లు... నిజామాబాద్ యువకుడి అద్భుత సృష్టి...