మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు రామకృష్ణ(ఆర్కే) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన చనిపోయినట్టు ఛత్తీస్‌గఢ్(chhattisgarh) పోలీసులు ధృవీకరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఆయన చనిపోయినట్టు తెలుస్తోంది. కొంతకాలంగా ఆర్కే అనారోగ్యంతో ఉన్నారని పోలీసులు కూడా చెబుతున్నారు. కరోనా (Covid 19) సమయంలో అనేక మంది మావోయిస్టులు ఇబ్బందిపడిన విధంగానే ఆర్కే కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే తాజాగా అనారోగ్యం కారణంగా ఆయన కన్నమూశారు. తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా జరిగిన అనేక మావోయిస్టు(Maoists) దాడుల్లో ఆర్కే కీలక పాత్ర పోషించారనే వార్తలు ఉన్నాయి. ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై బాంబు దాడి కేసులోనూ ఆయన నిందితుడిగా ఉన్నారు. ఆయనను పట్టుకునేందుకు పోలీసులు అనేకసార్లు ప్రత్యేకంగా ఆపరేషన్లు నిర్వహించారు.
అనేకసార్లు పోలీసుల చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నారు ఆర్కే. 2004లో నాటి సీఎం వైఎస్ఆర్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపినప్పుడు.. మావోయిస్టుల తరపున చర్చలకు నాయకత్వం వహించారు ఆర్కే. ఆయన ఆచూకీ తెలిపిన వారికి రివార్డులు ప్రకటిస్తామని అనేక రాష్ట్రాలు ప్రకటించాయి. ఒడిశా ప్రభుత్వం రూ. 20 లక్షలు, చత్తీస్‌గఢ్ రూ. 40 లక్షలు, జార్ఖండ్ రూ. 12 లక్షలు, ఆంధ్రప్రదేశ్ రూ. 25 లక్షలు రివార్డులు ప్రకటించాయి. ఏపీలో బలిమెల ఎన్కౌంటర్ తరువాత ఆర్కే పొరుగు రాష్ట్రంలోని బస్తర్‌కే పరిమితమైనట్టు పోలీసులు తెలిపారు.
ఆర్కే అసలు పేరు అక్కిరాజు హరగోపాల్. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తుమ్రుకోట. నాలుగు దశాబ్దాల క్రితం మావోయిస్టు ఉద్యమాలకు ఆకర్షితుడైన ఆర్కే.. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఉద్యమ నేతగా మారిన సమయంలోనే తన పేరును రామకృష్ణ అలియాస్ ఆర్కేగా మార్చుకున్నారు. ఆ తర్వాత విప్లవోద్యమంలో అగ్రనేతగా ఎదిగారు. మావోయిస్టు పార్టీలో అనేక కీలక పదవులను నిర్వహించారు. ఏపీ ఒడిశా సరిహద్దు ఇన్చార్జిగా కూడా ఉన్నారు. నాలుగు దశాబ్దాలుగా అడవిలోనే ఉన్న ఆయన.. వైఎస్ హయాంలో ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు బయటకు వచ్చారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.