అవును అక్కడ స్మారక స్థూపాలు కూలిపోతున్నాయి. ఎర్రజెండా పట్టి ఉద్యమ బాట నడచి ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయి.. అమరులుగా కీర్తి గడించిన వారి స్థూపాలు కదలిపోతున్నాయి.
అవును అక్కడ స్మారక స్థూపాలు కూలిపోతున్నాయి. ఎర్రజెండా పట్టి ఉద్యమ బాట నడచి ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయి.. అమరులుగా కీర్తి గడించిన వారి స్థూపాలు కదలిపోతున్నాయి. ఒక మరణం.. స్థూపంగా మారి.. మరికొందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నదన్న భావనను దూరం చేసే ప్రయత్నంలో పోలీసులున్నారు. వ్యూహాత్మక ఎత్తుగడలలో భాగంగా ఇప్పుడు అమరులైన మావోయిస్టుల స్మారక స్థూపాలు నేలమట్టమవుతున్నాయి. దీనికి చత్తీస్ఘడ్ ప్రాంతం వేదిక అవుతోంది. అక్కడ ఏ ఆదివాసీ గూడెంలో చూసినా ఒకటో రెండో స్థూపాలు కనిపిస్తుంటాయి. వీటిని ఇలాగే వదిలేస్తే వామపక్ష తీవ్రవాదం హీరోయిజంలా మారిపోతుందన్న కారణంగా పోలీసు ఉన్నతాధికారులు వాటిని తొలగించే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఎక్కడికక్కడ కనిపించిన స్థూపాలను పగులగొట్టుకుంటూ వెళ్తున్నారు. జేసీబీలతో స్థానిక పోలీసు బలగాలు, సీఆర్పీఎఫ్, గ్రేహౌండ్స్ సిబ్బంది కూంబింగ్‌లో భాగంగా తమకు తారసపడిన ప్రతి గూడెంలోనూ ఇదే పనిగా స్థూపాలను కూల్చేస్తున్నారు. దీనిపై ప్రస్తుతం చత్తీస్‌ఘడ్‌లోని బస్తర్ ప్రాంతంలో పెద్ద చర్చ నడుస్తోంది. గతానికి భిన్నంగా జరుగుతున్న ఈ విధ్వంసాలు వామపక్ష ఉద్యమాన్ని పూర్తిగా తుదముట్టించేందుకు చేస్తున్న కుట్రగా కొందరు అభివర్ణిస్తున్నారు.
ఏదైనా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నేత మరణిస్తే అక్కడక్కడా, కొన్నిసార్లు ఎక్కువ మొత్తంలో విగ్రహాలు పెట్టడం రివాజుగా వస్తోంది. అనుకూల రాజకీయ వాతావరణం ఉన్నంత కాలం సరే.. ఏమైనా మార్పులు జరిగినపుడు అక్కడక్కడా విగ్రహాలు ధ్వంసం చేయడం వింటూనే ఉంటాం. సదరు నాయకుని తాలూకూ చరిత్ర, కీర్తిని జనం మనసుల్లో లేకుండా చేయడానికి ఈ విధానాన్ని ఓ రాజకీయ వ్యూహంగా అవలంభిస్తుంటారు. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. కమ్యూనిస్టు పార్టీలు తమ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న సాధారణ కార్యకర్తలకు సైతం స్థూపాలు నిర్మించి వారి త్యాగాలను, ఆశయాలను బతికించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. దీనిలో భాగంగానే సీపీఐ మావోయిస్టు పార్టీ తమ ఉద్యమంలో కీలకంగా పనిచేసి పోలీసులతో జరిగిన కాల్పుల్లో చనిపోయిన వారి స్మృతిగా ఈ స్థూపాలను నిర్మిస్తుంటారు. అయితే నలుదిక్కులా పోలీసులు ఒత్తిడి పెంచడం.. నిరంతర కూంబింగ్ ద్వారా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు అణచివేసే కార్యక్రమం నడుస్తోంది. దీనికోసం కిల్లర్ వీరప్పన్ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసిన కేంద్ర ప్రభుత్వ అంతర్గత భద్రతా సలహాదారు కె.విజయ్‌కుమార్ నేతృత్వంలో చత్తీస్ఘడ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు గతేడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వెంకటాపురంలో సమావేశం అయ్యారు.
అప్పటి నుంచి కూంబింగ్ ఆపరేషన్స్ ను జాయింట్‌గా నిర్వహించాలన్న నిర్ణయం మేరకు ఒకరి సమాచారాన్ని ఒకరు షేర్ చేసుకుంటూ మావోయిస్టు ఉద్యమ తీవ్రతను అణచివేయడానికి కృషి చేస్తున్నారు. దీనికోసం ఆధునిక సాంకేతిక సమాచార వ్యవస్థను వాడుకుంటున్నారు. ఏకె-47 తుపాకీ తూటాకి కూడా అందనంత ఎత్తులో ఎగిరే డ్రోన్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు నక్సల్స్ ఆనుపానులను కనిపెడుతూ వారున్న ప్రాంతంలో కూంబింగ్ బృందాలను పెద్ద ఎత్తున్న చేరవేస్తున్నారు. అయితే రెండు నెలల క్రితం చోటుచేసుకున్న సీఆర్పీఎఫ్ జవాన్లపై ఊచకోతతో పోలీసు బృందాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. దీంతో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్న ఉన్నతాధికారులు మరికొన్ని వ్యూహాలకు పదునుపెడుతున్నారు.
మావోయిస్టు ఉద్యమంలోకి రిక్రూట్మెంట్ జరక్కుండా అడ్డుకునే అన్ని కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలు పెంచడం, విద్య,వైద్యం అందుబాటులోకి తేవడం, స్థానిక గిరిజన తెగలకు అవసరమైన రేషన్‌ను సకాలంలో పంపిణీ జరిగేలా చూడడం లాంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. దీన్లో భాగంగా నిత్యం గిరిజన గూడేల్లో ఉద్యమానికి సింబాలిక్‌గా నిలిచే స్థూపాలు యువతను ఆకట్టుకుంటున్నట్టు గుర్తించారు. దీంతో వీటిని సమూలంగా పెకిలించే పనిలో నిమగ్నమయ్యారు. బస్తర్ రీజియన్ లో ఇపుడు ఎక్కడ చూసినా పగులగొట్టిన స్థూపాలు కనిపిస్తున్నాయి. మరి పోలీసుల వ్యూహం ఏమేరకు విజయవంతం అవుతుందో వేచిచూడాలి.
(జి.శ్రీనివాసరెడ్డి, న్యూస్ 18 తెలుగు కరస్పాండెంట్-ఖమ్మం)
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.