MANIPUR ELECTION 2022 VOTING BEGINS FOR SECOND PHASE OF POLLS TODAY FOR 22 SEATS REPOLLING ALSO MKS
Manipur Polls: మణిపూర్లో చివరిదైన రెండో దశ పోలింగ్ షురూ.. హింస భయాలతో భారీ భద్రత
మణిపూర్ రెండో దశ పోలింగ్
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చివరిదైన రెండో దశ పోలింగ్ శనివారం కొనసాగుతోంది. ఆరు జిల్లాల్లోని 22 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి ఓటింగ్ మొదలైంది. తొలి దశలో హింస నేపథ్యంలో ఈసారి భద్రత కట్టుదిట్టం చేశారు.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చివరిదైన రెండో దశ పోలింగ్ శనివారం కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఆరు జిల్లాల్లోని 22 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతున్నది. 92 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మరోవైపు తొలి దశలో హింస కారణంగా అవాంతరాలు ఏర్పడిన బూత్ లలో కూడా నేడు రీపోలింగ్ జరుగుతోంది.
మణిపూర్ ఎన్నికల రెండో దశలో పోలింగ్లో 8,47,400 మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 4,18,401 మంది పురుషులు, 4,28,968 మంది మహిళలు, 31 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వీరికోసం 1247 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మాజీ సీఎం ఓక్రం ఇబోబిసింగ్, ఆయన కుమారుడు సూరజ్ కుమార్, మాజీ ఉపముఖ్యమంత్రి గైఖాంగమ్ వంటి ప్రముఖులు పోటీలో ఉన్నారు.
బీజేపీ నుంచి 22 మంది, కాంగ్రెస్ 18, జేడీయూ, నాగా పీపుల్స్ ఫ్రంట్ చెరో పది మంది, నేషనల్ పీపుల్స్ పార్టీ 11 మంది, శివసేన, ఎన్సీపీ ఇద్దరు చొప్పున, ఆర్పీఐఏ నుంచి ముగ్గురు, 12 మంది స్వతంత్ర అభ్యర్థులు రెండో విడుత బరిలో నిలిచారు. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 28న 38 స్థానాలకు మొదటి విడుత ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలకు భిన్నంగా మణిపూర్ లో హింస చెలరేగడం తెలిసిందే. ఫిబ్రవరి 28న జరిగిన తొలి దశ పోలింగ్ లో హింస కారణంగా కొన్ని చోట్ల అంతరాయం ఏర్పడింది. ఐదు నియోజకవర్గాల పరిధిలోని 12 పోలింగ్ స్టేషన్లలో ఇవాళ రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. తొలి దశ హింస నేపథ్యంలో నేడు భద్రతను కట్టుదిట్టం చేశారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.