Man played Lord Shiva in nukkad natak arrested : దేశంలో పెట్రోల్, డీజిల్‌లతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటుతున్నాయి. పెరిగిపోతున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరల పెరుగుదలపై ప్రజలు తమకు తోచిన విధంగా నిరసన(Protest) తెలుపుతున్నారు. తాజాగా ఒక జంట శివపార్వతుల వేషధారణలో వినూత్నంగా నిరసన తెలిపింది. శివ పార్వతుల వేషంలో రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ పై ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ సమస్యలను హైలెట్ చేస్తూ వీధుల్లో ఓ నాటకం ప్రదర్శింస్తూ కనిపించారు. దీంతో ఓ వర్గం వారి మనోభావాలను దెబ్బ తీసినందుకు వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసోం(Assam) రాష్ట్రంలో నౌగావ్ పట్టణంలో ఈ ఘటన జరిగింది.
అసోంలో నౌగావ్ పట్టణానికి చెందిన బిరించి బోరా, కరిష్మా.. శివుడు, పార్వతి వేషాధారణలో రాయల్ ఎన్ ఫీల్డ్ పై వీధుల్లో తిరుగుతూ పెరుగుతున్న ధరలను ప్రస్తావిస్తూ “నుక్కడ్” అనే నాటకం ప్రదర్శిస్తూ కనిపించారు.
శనివారం ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం హయాంలో ధరల పెరుగుదలపై నిరసన తెలిపడంలొ భాగంగా వీధి నాటకం వేశారు. ఇందులో భాగంగా బోరా శివుడిగా.. కరిష్మా పార్వతిగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌పై వెళ్తుంటారు. కొద్ది దూరం వెళ్లగానే పెట్రోల్ అయిపోయి.. బండి ఆగిపోతుంది. ఈ విషయంపై ఇరువురి మధ్య వాగ్వాదం నడుస్తుంది. దీంతో పెట్రోల్ ధరల పెంపు సహా ఇతర అంశాలను లేవనెత్తుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై శివుడు ఆరోపణలు చేస్తారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని పిలుపునిస్తారు. ఈ సంఘటన చాలా మంది దృష్టిని ఆకర్షించింది, అయితే వీధుల్లో శివపార్వతుల వేషాల్లో తిరగటం పై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ శివపార్వతుల వేషం వేసి నిరసన తెలిపిన బోరా, కరిష్మాపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బోరాను అరెస్ట్ చేశారు. మరొకవైపు ఈ నాటక ప్రదర్శనలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న మరొ ఇద్దరు ఇంకా దొరకలేదని స్థానిక పోలీసులు అధికారి మనోజ్ రాజవంశీ తెలిపారు.
Shiva Temple : ఆ శివాలయంలో ఇంటి నుంచి పారిపోయి వచ్చిన లవర్స్ కి ఫ్రీగా షెల్టర్,ఫుడ్
మరోవైపు, ధరల పెరుగుదలపై శివుడి వేషంలో నిరసన తెలిపిన వ్యక్తిని అరెస్ట్ చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అసోం సీఎం హిమంత బిస్వా శర్మ స్పందించారు. ఒక వ్యక్తి ట్విట్టర్ లో చేసిన విమర్శకు సీఎం రిప్లై ఇచ్చారు. అభ్యంతరకరమైన అంశాలు మాట్లాడనంత వరకు దేవుళ్ల వేషధారణ తప్పు కాదని సీఎం అన్నారు. శివుడి వేషంలో నిరసన తెలిపిన వ్యక్తి అరెస్ట్‌పై నాగావ్ పోలీసులకు తగిన ఆదేశాలు జారీ చేశామని, దీంతో ఆయన బెయిల్ పొందాడంటూ ట్వీట్ లో సీఎం పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Arrested, Assam, Lord Shiva