Man VS wild: డిస్కవరీ ఛానెల్లో ప్రసారమైన Man VS wild షోలో తన జీవితంలో చోటు చేసుకున్న ఎన్నో ఘటనలను బేర్ గ్రిల్స్‌తో పంచుకున్నారు ప్రధాని మోదీ. చిన్నప్పుడు చేసిన సరదా పనులను గురించి డిస్కవరీ ఛానెల్ షో ద్వారా వెల్లడించారు. తన చిన్నతనంలో ఓసారి మొసలిని పట్టుకున్నారట ప్రధాని మోదీ. ఐతే తన తల్లి మందలించడంతో తిరిగి చెరువులో వదలిపెట్టి వచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా మోదీయే వెల్లడించారు.
నేను చిన్నప్పుడు చెరువులో స్నానం చేసేవాడిని. ప్రతి రోజు అక్కడే స్నానం చేసేవాడిని. మాకు వేరే మార్గం లేదు. ఓ రోజు స్నానం చేస్తుండగా చెరువులో మొసలి పిల్ల కనిపించింది. దాన్ని పట్టుకొని ఇంటికి తీసుకెళ్లా. ఐతే తల్లీ బిడ్డలను వేరుచేయడదని మా అమ్మ నన్ను మందలించింది. వాటిని మనం పెంచలేమని చెప్పింది. మళ్లీ ఆ మొసలి పిల్లను తిరిగి తీసుకెళ్లి చెరువులో వదిలిపెట్టా.
— నరేంద్ర మోదీ
తన చిన్నతనంలో మురికి బట్టలనే ధరించేవాడినని..స్కూల్‌కు మాత్రం నీట్‌గా వెళ్లేవాడినని చెప్పారు మోదీ. రాగి చెంబులో నిప్పులు వేసి దుస్తులను ఇస్త్రీ చేసుకునేవారమని గ్రిల్స్‌తో చెప్పారు మోదీ. కాగా, ప్రధాని మోదీ పాల్గొన్న ఈ మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోని 12 ఛానెళ్ల ద్వారా 180 దేశాల్లో ప్రసారం చేశారు.