అతడి వయసు 24 ఏళ్లు. బైక్ మెకానిక్ గా పనిచేస్తూ సొంతకాళ్లపై నిలబడ్డాడు. ఇంతలో తల్లిదండ్రులు పెళ్లి (Marriage) సంబంధం ఫిక్స్ చేశారు. భార్యతో అందమైన జీవితాన్ని ఊహించుకొని ఆమె మెడలో తాళికట్టాడు. కానీ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అది జీవితం ఎందుకవుతుంది. ప్రేమను పంచాల్సిన భార్య అతడ్ని వంచించింది. ఆమె చేసిన తప్పుకు అత్తమామలు, ఆమె తరపు బంధువులు వంతపాడారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కృష్ణాజిల్లా (Krishna District) జగ్గయ్యపేట పట్టణంలోని మిత్తగూడెం ప్రాంతానికి చెందిన ఆళ్ల వెంకటేశ్వరరావు బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. కొంతకాలం క్రితం కృష్ణవేణి అనే యువతితో పెళ్లైంది. కొన్నాళ్లపాటు కాపురం సజావుగానే సాగింది. కానీ ఓ రోజు వెంకటేశ్వరరావుకు ఊహించని ఘటన ఎదురైంది. ఆ ఘటన అతడి తల్లిదండ్రులు, తమ్ముళ్లను శోకసంద్రంలో మునిగేలా చేసింది.
చిచ్చురేపిన ఫోన్ కాల్
ఓ రోజు భార్య ఫోన్లో మాట్లాడుతుండగా ఎవరితో మాట్లాడుతున్నావని వెంటేశ్వరరావు నిలదీశాడు. మా అక్కతో మాట్లాడుతున్నానని చెప్పింది. ఆ నెంబర్ కు కాల్ చేయగా.. అవతల మగ వ్యక్తి గొంతు వినిపించింది. దీనిపై వెంకటేశ్వరరావు భార్యను నిలదీయగా ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి కాపురానికి రావాలని కోరినా వినకపోవడం, అతడ్నే ఇల్లరికం వచ్చేయమనడమే కాకుండా వేధింపులకు గురిచేశారు. దీంతో మనస్తాపం చెంది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
సెల్ఫీ వీడియోలో ఆవేదన
చనిపోయే ముందుకు సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదనను చెప్పుకున్నాడు. తన చావుకు తన భార్య కృష్ణవేణి, గోగుల వీరబాబు, గోగుల సత్యవతి, ఎన్.వెంకన్న, కృష్ణవేణి వాళ్లక్క బిందు కారణమని వివరించాడు. పోలీసులు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. ‘‘అమ్మ నన్ను క్షమించమ్మ.. ఇక నీతో మాట్లాడలేనమ్మ.. ఇదే లాస్ట్ మాటమ్మ.. నేను చచ్చిపోతున్నాను.. తనకు చనిపోవాలని లేదని.. కానీ బ్రతకలేకపోతున్నాను.. మీరు మాత్రం నా గురించి ఆగం కావద్దు.. ఇద్దరు తమ్ముళ్లను మంచిగా చూసుకుని ఆనందంగా ఉండాలమ్మ..మీరు సంతోషంగా ఉంటే చాలమ్మ.. నా జీవితంలో కష్టం తప్ప ఏనాడూ సుఖపడలేదమ్మ.. మీ అందరినీ వదిలిపెట్టి పోవాలని లేదు.. అన్ని విధాల మోసపోయాను.. నేను చనిపోయిన తర్వాత కృష్ణవేణి వస్తే నా శవాన్ని ముట్టుకోనివ్వద్దు.. నా చేతిపై ఆమె పేరుంది... అది తీసేసి నన్ను దహనం చేయాలని వెంకటేశ్వరరావు సెల్ఫీ వీడియోలో కన్నీటిపర్యంతమయ్యాడు.
ప్రస్తుతం వెంకటేశ్వరరావు తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ కుమారుడు భార్య, వారి తల్లిదండ్రుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చిత్తూరు జిల్లా మదనపల్లెలో భాస్కర్ అనే వ్యక్తి భార్య, అత్తింటివారి వేధింపులు తట్టుకోలే ఫేస్ బుక్ లైవ్ లో ఉరేసుకున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Extramarital affairs, Husband commits suicide, Krishna District