కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి.. తాగిన మత్తులో విచక్షణ మరిచాడు. భార్య మీద కోపంతో తానేం చేస్తున్నాడో తెలియని మైకంలోకి వెళ్లిపోయాడు. ఆపద వస్తే కాపాడాల్సిన వాడు.. సొంత పిల్లలనే కాటికి పంపే ప్రయత్నం చేశాడు. కెనాల్‌లోకి తోసేశాడు. అయితే తన ధైర్యంతో తన తోబుట్టువులను ప్రాణాలకు తెగించి కాపాడుకుంది ఆ అక్క..! నీటిలో కొట్టుకుపోతున్న తన అన్నని, చెల్లిని బతికించుకుంది. మరో చిన్నిచెల్లిని మాత్రం కాపాడలేకపోయింది. ఇప్పటివరకు ఆ చిట్టిచెల్లి ఆచూకీ కనిపించలేదు. అసలు ఎవరా అక్కా..? ఏంటీ కథ..? ఎక్కడ జరిగిందీ ఘటన..? సొంత తండ్రే తన పిల్లలను కాలువలోకి ఎందుకు తోశాడు...?
నీళ్లలోకి నెట్టేసిన తండ్రి:
ఉత్తర్ ప్రదేశ్ షేక్‌పూర్ హుందాకు చెందిన పుష్పేందర్ తన భార్యతో గొడవ పడ్డాడు. ఆ కోపంతోనే ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. వెళ్తూ వెళ్తూ.. తన నలుగురు పిల్లలను తనతోనే తీసుకెళ్లాడు. కెనాల్ వంతెన చూపిస్తానంటూ నమ్మబలికాడు. తండ్రి మాటలను నమ్మిన నలుగురు పిల్లలు.. నాన్న వెంటే వెళ్లారు. ఆటోలో కెనాల్ వరకు వెళ్లిన తర్వాత తాగిన మత్తులో ఏం చేస్తున్నాడో మరిచిపోయాడు. వంతెన గొడపై నలుగురు పిల్లలను కూర్చొబెట్టిన పుష్పేందర్.. వారిని మాటల్లో పెట్టి నీటిలోకి తోసేశాడు. 15అడుగుల లోతు ఉన్న కాలువ అది.
అక్క ధైర్యసాహసమే కాపాడింది:
ఊహించని ఈ పరిణామంతో ఏం జరుగుతుందో తెలిసేలోపే నలుగురు పిల్లలు కాలువలో పడిపోయారు. ఊపిరి ఆడని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. అయితే ఈత వచ్చిన 12ఏళ్ల ప్రభ..తన 8ఏళ్ల చెల్లి కాజల్‌ను ముందు తన భుజంపై వేసుకుంది. అలా ఈదుకుంటూ ఆమెను ఒడ్డుకు చేర్చింది. ఇక అదే సమయంలో తన 13ఏళ్ల అన్న సోనూ మునిగిపోతుండటాన్ని గమనించింది. వెంటనే అప్రమత్తమైన ప్రభ.. తన అన్నను కూడా ప్రాణాలకు తెగించి కాపాడుకుంది. అయితే 5ఏళ్ల చిట్టిచెల్లి హేమలత మాత్రం కనిపించలేదు. ఇదంతా జరుగుతున్న సమయంలో సమీపంలోనే ఉన్న స్థానికులు కాలువ దగ్గరకు చేరుకున్నారు. పిల్లలను ఆస్పత్రికి తరలించారు. అటు హేమలత కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తన చిన్ని చెల్లి హేమలతకు ఏమీ కాకూడదని ప్రభతో పాటు సోనూ, కాజల్ గుక్కపట్టి ఏడుస్తున్నారు. హేమలత క్షేమంగా బయటపడాలని కోరుకుంటున్నారు. అటు రంగంలోకి దిగిన పోలీసులు తండ్రి పుష్పేందర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మద్యం మత్తులో, భార్య మీద కోపంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తండ్రి ఒప్పుకున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Baby sister, Father, National, Sister love, Swimming, Uttar pradesh, Water