Fake Sanitisers: శానిటైజర్లనూ వదల్లేదు.. రాజ్యమేలుతున్న నకిలీ శానిటైజర్లు.. 10 నెలల్లో రూ.10 కోట్ల విక్రయాలు.. ఎక్కడో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం

Fake Sanitisers: నకిలీకి కాదేది అనర్హం అన్న చందంగా మారింది కేటుగాళ్లకు. పాలు, కూరగాయలు, పండ్లు, నూనెలు ఇలా ఏది చూసినా కల్తీ చేస్తున్నారు. చివరకు కరోనా మహమ్మారిని అడ్డుకోవడంలో తోడ్పడే శానిటైజర్లలో కూడా కల్తీ రాజ్యమేలుతుంది. గుజరాత్ రాష్ట్రంలో కల్తీ శానిటైజర్లను విక్రయించి ఓ వ్యాపారి రూ.10 కోట్లు సంపాదించారు.

 • Share this:
  ఓ వైపు కరోనా కోరలు చాస్తుంటే మరో వైపు కొంతమంది దానిని అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రస్తుతం ప్రతీ ఒక్కరికి మాస్క్, శానిటైజర్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. వీటిని వాడటం వల్లనే మనల్ని మనం కాపాడుకోగలమని వైద్య నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. అందుకే కొంతమంది వ్యాపారవేత్తలు ప్రజల అవసరాలను ఆసరాగ చేసుకొని దోచేస్తున్నారు. నిన్న మాస్క్ లకు బ్రండెడ్ లోగోలను అతికించి విక్రయించారు. నేడు శానిటైజర్లను కల్తీ చేసి అమ్మి లాభాలను అర్జిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రంలో ఫేక్ హ్యాండ్ శానిటైజర్ ను విక్రయించి కేవలం పది నెలల్లో రూ. 10 కోట్ల ఉత్పత్తులను విక్రయించారు. వడోదర పట్టణంలో నితిన్ కొత్వానీ అనే వ్యక్తి శానిటైజర్లను విక్రయిస్తుంటాడు. ఆయన దాదాపు 10 నెలలుగా ఇదే వ్యాపారాన్ని నడుపుతున్నాడు.

  విశ్వసనీయ సమాచారం మేరకు అతడు ఆ శానిటైజర్లలో అత్యంత ప్రమాదకరమైన రసాయనాన్ని ఉపయోగించి తయారు చేస్తున్నట్లు పోలీసులకు తెలిసింది. వెంటనే పోలీసులు కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు తెలియజేశారు. స్పందించిన కాలుష్య నియంత్రణ అధికారులు శానిటైజర్ విక్రయించే కొత్వానీ దుకాణంపై దాడి నిర్వహించారు. అక్కడ అత్యంత ప్రమాదకరమైన మిథనాల్ ను అందులో కలుపుతున్నట్లు అధికారులు నిర్దారించారు. వెంటనే పోలీసులు అతడి దుకాణం వద్దకు చేరుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు అక్కడ ఎనిమిది వేల లీటర్ల కల్తీ శానిటైజర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  ఇందులో 5 లీటర్లు, 500 ఎంఎల్, 200 ఎంఎల్, 100 ఎంఎల్, 50 ఎంఎల్ ప్యాకేజీలున్నాయి. స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ రూ. 45.47 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. మొత్తంగా కొత్వానీ రూ. 10 కోట్ల విలువైన ఉత్పత్తులను విక్రయించాడని అధికారులు వెల్లడించారు. అయితే అతడు చిన్న చిన్న బాటిళ్లపై ప్రముఖ బ్రాండ్ల స్టిక్కర్లను అతికించి దుకాణాలకు విక్రయించేవాడు. అతడు ఏ ఏ దుకాణాలకు విక్రయించాడనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
  Published by:Veera Babu
  First published: