Home /News /national /

Amit Shah: అమిత్ షా పైకి ప్లకార్డు విసిరిన వృద్ధుడు.. అసలు ఏం జరిగిందంటే..?

Amit Shah: అమిత్ షా పైకి ప్లకార్డు విసిరిన వృద్ధుడు.. అసలు ఏం జరిగిందంటే..?

మద్దతుదారులకు అభివాదం చేస్తున్న అమిత్ షా(Photo-Twitter/BJP Tamilnadu)

మద్దతుదారులకు అభివాదం చేస్తున్న అమిత్ షా(Photo-Twitter/BJP Tamilnadu)

చెన్నైలో పర్యటిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాపైకి ఓ వ్యక్తి ఫ్లకార్డు విసిరాడు. అయితే భద్రత సిబ్బంది అది అమిత్ షా వద్దకు చేరకుండా అడ్డుకున్నారు.

    చెన్నైలో పర్యటిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాపైకి ఓ వ్యక్తి ఫ్లకార్డు విసిరాడు. అయితే భద్రత సిబ్బంది అది అమిత్ షా వద్దకు చేరకుండా అడ్డుకున్నారు. శనివారం చెన్నై విమానాశ్రయం చేరుకున్న అమిత్ షా.. అక్కడి నుంచి హోటల్‌కు బయలుదేరారు. అయితే ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున బీజేపీ, అన్నాడీఎంకే ఎయిర్‌పోర్ట్ బయట వేచిఉన్నారు. ఇది గమనించి అమిత్ షా ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి, తన బుల్లెట్ ఫ్రూప్ కాన్వాయ్‌లో నుంచి దిగి మరి వారికి అభివాదం చేశారు. దాదాపు ఐదు నిమిషాల పాటు ఆయన రోడ్డుపై నడిచి తన కోసం వేచి ఉన్న కార్యకర్తల్లో జోష్ నింపారు. అయితే అమిత్ షా కార్యకర్తలకు అభివాదం చేస్తున్న సమయంలో ఓ 60 ఏళ్ల వ్యక్తి ఆయనపైకి ప్లకార్డ్ విసిరాడు. అయితే అది ఆయన వరకు చేరకుండా భద్రత సిబ్బంది అడ్డుకున్నారు.

    దీంతో అప్రమత్తమైన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎయిర్‌పోర్ట్ సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను తరలించారు. అతడిని నంగనల్లూరుకు చెందిన దురైరాజ్‌గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. అతడిని ప్రాథమికంగా విచారించిన అనంతరం పోలీసులు పలు వివరాలు వెల్లడించారు. "హోటల్‌కు వెళ్తున్న అమిత్ షా తన మద్దతుదారులకు అభివాదం చేసేందుకు కారులో నుంచి దిగి దాదాపు 400 మీటర్లు దూరం నడిచారు. అమిత్ షా 100 మీటర్లు నడిచిన తర్వాత ఓ వ్యక్తి ఆయన మీదకు తను పట్టుకున్న ప్లకార్డును విసిరే ప్రయత్నం చేశారు. కానీ భద్రతా సిబ్బంది అతని ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ప్లకార్డు అమిత్ షాకు చాలా దూరంలో పడిపోవడంతో.. ఆయన దానిని గమనించలేదు. అయితే కొద్ది సేపటికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగున్ పోలీసు సిబ్బంది వద్దకు ఈ ఘటన గురించి ఆరా తీశారు"అని తెలిపారు. ఇక, ప్లకార్డు విసిరిన వ్యక్తి మతి స్థిమితం సరిగా లేదని పోలీసులు తర్వాత వెల్లడించారు.

    ఇక, అమిత్ షా రెండు రోజుల పాటు తమిళనాట పర్యటించనున్నారు. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండడం.. బీజేపీ-అన్నాడీఎంకే కలిసి పోటీ చేయబోతున్నాయన్న ఊహాగానాల నేపథ్యంలో... చెన్నైలో అమిత్ షా పర్యటన హాట్ టాపిక్‌గా మారింది. ఈ పర్యటనలో అమిత్ షా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారు. మరోవైపు చెన్నైలో అమిత్ షా పర్యటనను డీఎంకే సహా పలు పార్టీలు, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అమిత్ షా పర్యటనకు వ్యతిరేకంగా చాలా మంది ట్వీట్ల మోత మోగించారు. #GoBackAmitShah హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్ చేశారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Amit Shah, Chennai

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు