కోల్‌కత్తా: తృణముల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఉప ఎన్నికలో (by election) పోటీకి సిద్ధమవుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమి పాలైన మమత తన ముఖ్యమంత్రి పదవిని నిలుపుకునేందుకు మరో స్థానం నుంచి పోటీకి సమాయత్తమవుతున్నారు. ఆమె గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన భవానీపూర్ అసెంబ్లీ స్థానం నుంచి దీదీ పోటీ చేయనున్నారు. అంతేకాదు.. సెప్టెంబర్ 10న ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న తృణముల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మమత నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీంతో.. మరోసారి పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేడి రాజుకుంది.
ఈ స్థానానికి తోడు పశ్చిమ బెంగాల్‌లోని మరో రెండు అసెంబ్లీ స్థానాలైన సంసేర్గంజ్, జంగీపూర్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇప్పటికే ఉప ఎన్నికకు సంబంధించి ఈసీ(Election Commission of India) షెడ్యూల్ ప్రకటించింది. సెప్టెంబర్ 30న భవానీపూర్ స్థానానికి ఉప ఎన్నిక, సంసేర్గంజ్, జంగీపూర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
బీజేపీ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో తలమునకలైంది. విపక్షాలు ఐకమత్యం కావాల్సిన అవసరం దృష్ట్యా మమతకు వ్యతిరేకంగా అభ్యర్థిని నిలిపే ఉద్దేశం లేదని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అంతేకాదు.. కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికలో మమతకు మద్దతివ్వాలని కూడా భావిస్తోంది. ఇక.. మమతపై పోటీకి నిలిపే విషయంలో పశ్చిమ బెంగాల్‌లోని లెఫ్ట్ ఫ్రంట్ కమిటీ ‘తగ్గేదేలే’ అంటోంది. CPI(M) ఇప్పటికే ఈ మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. CPI(M) అభ్యర్థిగా మమతపై శ్రీజీవ్ బిశ్వాస్ బరిలోకి దిగనున్నారు. మహ్మద్ మదసర్ హుస్సేన్ సంసేర్గంజ్ నుంచి, జానే ఆలం మిగ్యా జంగీపూర్ స్థానం నుంచి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Taliban: వామ్మో.. తాలిబన్ల పాలనలో మహిళల ఫ్యూచర్ ఏంటో ఈ ఒక్క వీడియో చూస్తే చాలదా..!
భవానీపూర్ అసెంబ్లీ స్థానం మే 21 నుంచి ఖాళీగా ఉంది. ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే శోభన్ దేవ్ చటోపాధ్యాయ ముఖ్యమంత్రి కోసం తన సీటుకు రాజీనామా చేశారు. మమత సీఎంగా కొనసాగాలంటే ఈ ఉప ఎన్నికలో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో మమత పార్టీని గెలిపించి.. ఎమ్మెల్యేగా రెండోసారి కూడా గెలవలేకపోయిన వ్యక్తిగా అపఖ్యాతిని మూటగట్టుకోక తప్పదు. అందుకే.. ఈసారి మమత తాను పోటీ చేసే స్థానం విషయంలో ఆచితూచి వ్యవహరించారు. భవానీపూర్ లాంటి సేఫ్ జోన్‌ను ఎంచుకున్నారు. తృణముల్‌కు ఈ స్థానంలో మంచి పట్టు ఉండటం.. మమత కూడా ఇదే స్థానం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం ఉప ఎన్నిక బరిలో దిగనున్న ముఖ్యమంత్రి మమత బెనర్జీకి కలిసొచ్చే అంశాలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Congress, CPI, Mamata Banerjee, TMC, West Bengal