• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • MAMATA BANERJEE RELEASES ELECTION MANIFESTO OF TMC FOR WEST BENGAL ELECTIONS 2021 PROMISES PENSION AND JOBS AK

Mamata Banerjee: పెన్షన్లు, ఉద్యోగాలు.. వరాలే వరాలు.. ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన మమత బెనర్జీ

Mamata Banerjee: పెన్షన్లు, ఉద్యోగాలు.. వరాలే వరాలు.. ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన మమత బెనర్జీ

ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన మమతా బెనర్జీ

Mamata Banerjee: తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన మమత బెనర్జీ.. అందులో అనేక హామీలను పొందుపర్చారు.

  • Share this:
    ముచ్చటగా మూడోసారి పశ్చిమ బెంగాల్‌లో అధికారం సాధించాలని సర్వశక్తులు ఒడ్డుతున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ.. నేడు తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. మొత్తం 10 అంశాలను ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. తాము అధికారంలోకి వస్తే చిన్న, సన్నకారు రైతులకు ఎకరాకు ఏడాదికి ఇస్తున్న ₹6వేల సాయాన్ని ₹10వేలకు పెంచుతామని మమత హామీ ఇచ్చారు. ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు క్రెడిట్‌ కార్డు ఇస్తామని పేర్కొన్నారు. కేవలం 4 శాతం వడ్డీకే 10 లక్షల వరకు రుణం అందజేస్తామని చెప్పారు. ఏటా 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న 1.6 కోట్ల మంది మహిళలకు నగదు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. జనరల్‌ కేటగిరీ మహిళలకు నెలకు ₹500, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకైతే ₹1000 చొప్పున ఇస్తామని చెప్పారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర ఆదాయం రూ.25,000 కోట్లు ఉండేదన్న మమత బెనర్జీ.. ఇప్పుడు అది రూ.75,000 కోట్లకు చేరిందని చెప్పుకొచ్చారు.

    రాష్ట్రంలోని 50 నగరాల్లో 2,500 క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని మమత మేనిఫెస్లోలో ప్రకటించారు. మెడికల్‌ సీట్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్ల పెంపు, తక్కువ ధరకే ఇళ్ల నిర్మాణం, తాగునీటి సదుపాయం, 24 గంటల విద్యుత్‌ వంటి హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. రేషన్‌ను ఇంటికే అందించే ఏర్పాటు చేస్తామని మమత చెప్పారు.తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బెంగాల్‌లో సామాజిక సంస్కర్తలైన రబీంద్రనాథ్ ఠాగూర్, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వంటి వారి పేర్లను మమత బెనర్జీ ప్రస్తావించారు. బెంగాల్‌కు సమున్నత సంస్కృతి ఉందని, విభజన రాజకీయాలకు తావు లేదని అన్నారు. ఇది రాజకీయ మేనిఫెస్టో కాదని, అభివృద్ధిదాయక మేనిఫెస్టో అని తెలిపారు. ఎన్నికల కమిషన్‌కు బీజేపీ మార్గనిర్దేశం చేస్తోందని, ఎన్నికల కమిషన్ అధికారాలను దుర్వినియోగం చేస్తోందని విమర్శలు గుప్పించారు.

    ఇక పశ్చిమ బెంగాల్లో ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6, ఏప్రిల్ 10, ఏప్రిల్ 17, ఏప్రిల్ 22, ఏప్రిల్ 26, ఏప్రిల్ 29న ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. పుర్బా మేదినీపూర్‌ జిల్లాలోని నందిగ్రామ్ నుంచి మమతా బెనర్జీ పోటీ చేయనున్నారు. రెండో విడతలో భాగంగా ఏప్రిల్ 1న నందిగ్రామ్‌లో పోలింగ్ జరగనుంది.
    Published by:Kishore Akkaladevi
    First published: