Bhabanipur bypoll: భారీ భద్రత నడుమ భవానీపూర్ ఓటింగ్.. మమత గెలుపును ఆపడం సాధ్యమేనా?

మమత బెనర్జీ

Bhabanipur By polls: భవానీపూర్ ఉప ఎన్నికలో మమతా బెనర్జీ గెలవడం అనివార్యంగా మారింది. సీఎం కుర్చీ నుంచి దిగకుండా ఉండాలంటే ఆమె భవానీపూర్‌ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి వెళ్లాల్సి ఉంటుంది.

  • Share this:
పశ్చిమ బెంగాల్‌ (West Bengal) సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) భవానీపూర్‌ (Bhabanipur) నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో టీఎంసీ అత్యధిక స్థానాల్లో గెలుపొందడంతో సీఎం పదవీ బాధ్యతలను స్వీకరించారు. కానీ పోటీ చేసిన నందిగ్రామ్‌ నియోజకవర్గంలో మాత్రం ఓటమి పాలయ్యారు. ఆమె బీజేపీ నేత సువేందు అధికారికి (Suvendu Adhikari) పోటీగా నందిగ్రామ్‌ (Nandigram) నియోజకవర్గం నుంచి పోటీ చేసి అనూహ్య రీతిలో ఓడిపోయారు. దాంతో టీఎంసీ పార్టీ భారీ ఆధిక్యత సాధించినా మమతా మళ్లీ ఉప ఎన్నికకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ భవానీపూర్‌ ఉప ఎన్నిక పోలింగ్ తాజాగా ప్రారంభమైంది. గురువారం ఉదయం 7 గంటలకు ఆరంభమైన ఓటింగ్‌ సాయంత్రం 6.30 గంటల వరకు జరగనుంది. ప్రస్తుతం భారీ భద్రత నడుమ భవానీపూర్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది.

నేడు భవానీపూర్‌తో సహా బెంగాల్‌లోని జాంగీపూర్‌, సంషేర్‌గంజ్‌ నియోజకవర్గాలకు కూడా పోలింగ్‌ జరుగుతోంది. ఈ ఉప ఎన్నికలకు ముందుగా సెప్టెంబర్ 27న భవానీపూర్‌లో బీజేపీ నేత దిలీప్ ఘోష్‌ను టీఎంసీ కార్యకర్తలు ఎద్దేవా చేశారు. అది హింసాత్మక వాతావరణానికి దారి తీసింది. దిలీప్ ఘోష్ సెక్యూరిటీ గార్డులు ఆ ప్రాంతంలో గుంపును బెదిరించడానికి తుపాకులను చూపించారు. తాజా పరిణామాలతో పాటు గత అసెంబ్లీ ఎన్నికల వేళ జరిగిన హింసాత్మక ఘటనలను అధికారులు దృష్టిలో పెట్టుకున్నారు. అందుకే అలాంటి హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా పారామిలిటరీ బలగాలతో విస్తృత బందోబస్తు నిర్వహిస్తున్నారు.

2011లో భవానీపూర్‌ నుంచి ఉపఎన్నికలో గెలుపు బావుటా ఎగురవేసిన మమతా 2016 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ నియోజకవర్గంలో గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ నేత సోభాందేవ్‌ ఛటోపాధ్యాయ(Sobhandeb Chattopadhyay) భబానీపూర్ నుంచి గెలిచారు. కానీ మమతా పోటీ కోసం అతను తన పదవికి రాజీనామా చేశారు. ఈసారి ఈ ఉప ఎన్నికలలో మమతాకి పోటీగా బీజేపీ అభ్యర్థి న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్‌ బరిలోకి దిగారు.

ఈ ఉప ఎన్నికలో మమతా బెనర్జీ గెలవడం అనివార్యంగా మారింది. సీఎం కుర్చీ నుంచి దిగకుండా ఉండాలంటే ఆమె భవానీపూర్‌ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి వెళ్లాల్సి ఉంటుంది. భవానీపూర్ నియోజకవర్గంలో గెలవడమే కాకుండా తనకు ఉన్న ప్రజాదరణను కూడా ఆమె నిరూపించుకోవాల్సి వస్తోంది. ఈ కీలకమైన ఉప ఎన్నికల ఫలితాలపైనే మమతా బెనర్జీ సీఎం పదవిలో కొనసాగుతారా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. దీంతో ఈ ఉప ఎన్నికకు భారత దేశ వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈరోజు ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా.. వాటి ఫలితాలు అక్టోబర్ 5న ప్రకటిస్తారు.
Published by:Shiva Kumar Addula
First published: