MAHATMA GANDHI WHO TOOK THE PHOTO OF MAHATMA GANDHI ON THE NOTES WHERE DID IT COME FROM EVK
Mahatma Gandhi: నోట్లమీద ఉన్న మహాత్మాగాంధీ ఫోటో ఎవరు తీశారు.. ఎక్కడి నుంచి వచ్చింది?
ప్రతీకాత్మక చిత్రం
Mahatma Gandhi | నేడు మహాత్మాగాంధీ వర్ధంతి. ఆయనను ప్రతీ రోజు మనం నోట్లపై చూస్తూనే ఉంటాం. బోసి నవ్వులతో కనిపించే ఆ ఫోటో భారతీయులకు నిత్యం కనిపిస్తూనే ఉంటుంది. అసలు ఈ ఫోటో ఎవరు తీశారు.. ఎక్కడి నుంచి ప్రభుత్వం తీసుకొంది. ఇంకా ఈ బొమ్మనే ఎందుకు కొనసాగిస్తున్నారు.. అనే విషయాలు తెలుసుకోండి.
నేడు మహాత్మాగాంధీ (Mahatma Gandhi) వర్ధంతి. ఆయనను ప్రతీ రోజు మనం నోట్లపై చూస్తూనే ఉంటాం. బోసి నవ్వులతో కనిపించే ఆ ఫోటో భారతీయులకు నిత్యం కనిపిస్తూనే ఉంటుంది. భారత స్వాతంత్య్రం తరువాత అశోక స్తంభంతో నోట్లను ముద్రించే వారు. 1950లో గణతంత్ర భారత్‌లో తొలిసారి రూ.2, రూ.5, రూ.10, రూ.100 నోట్లను అందుబాటులకి తీసుకువచ్చారు. వాటి డిజైన్ల మధ్య తేడాలు లేవు గానీ, రంగులు భిన్నంగా ఉన్నాయి. రూ.10 నోటు వెనుకవైపు పడవల బొమ్మలను అలాగే ఉంచారు. 1954లో రూ.1000, రూ.2000, రూ.10,000 నోట్లను తిరిగి తీసుకువచ్చారు. 1978లో మళ్లీ వీటిని రద్దు చేశారు. రూ.2, రూ.5 నోట్లపై సింహాలు, జింక వంటి వాటిని ముద్రించారు. 1975 నుంచి రూ.100 నోట్లపై వ్యవసాయ స్వయంసమృద్ధి, తేయాకు తోటల్లో ఆకులను తెంపడం వంటి ఫోటోలను ముద్రించే వారు.
1987 అక్టోబర్‌లో తొలిసారిగా రిజర్వు బ్యాంకు రూ.500 నోటును ముద్రించింది. దీనిపై గాంధీ బొమ్మను, వాటర్ మార్క్ (Water Mark) లో అశోక స్తంభాన్ని ముద్రించింది. 1996లో కొత్త భద్రత ప్రమాణాలతో మహాత్మ గాంధీ సిరీస్ నోట్ల ముద్రణ మొదలైంది. వాటర్‌మార్క్‌ను కూడా మార్చారు. అంధులు కూడా గుర్తించేలా, వాటిని రూపొందించారు. 2000 అక్టోబర్ 9న రూ.1000 నోట్లను రిజర్వు బ్యాంకు (Reserve Bank) జారీ చేసింది.
మహాత్మాగాంధీ ఫోటో ఎక్కడిది..
2016లో నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను తీసుకొచ్చారు. అయితే మహ్మాత్మాగాంధీ బొమ్మను మార్చ లేదు. అయితే మహాత్మాగాంధీ ఫోటో ఎక్కడ నుండి వచ్చింది అన్నది చాలా మందికి తెలియదు. బోసి నవ్వులు నవ్వుతున్న గాంధీ ఫోటోను 1946వ సంవత్సరంలో గుర్తుతెలియని ఫోటోగ్రాఫర్ (Photographer) తన కెమెరా (Camera)లో బంధించాడు. కోల్‌కతాలోని వైస్రాయ్ భవన్ లో బ్రిటిష్ సెక్రెటరీ లారెన్స్ అనే వ్యక్తిని 1946వ సంవత్సరంలో మహాత్మా గాంధీ కలవడానికి వెళ్లాడు. ఆ సమయంలోనే ఈ ఫోటోను తీశారట.
ఇక ఆ ఫోటోను వైస్రాయ్ భవనం (Viceroy building) నుంచి మనవాళ్లు తీసుకున్నారు. ఆ ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించడానికి అనుకూలంగా చేసుకుని ముద్రించడం ప్రారంభించారు. మహాత్మాగాంధీ ఫోటోకు మిర్రర్ ఇమేజ్ ను మొదటిసారిగా 1987లో ఐదు వందల నోటు పై ముద్రించారు. గాంధీజీ సిరీస్ నోట్లు 1996వ సంవత్సరం నుండి అందుబాటులోకి వచ్చాయి. ఇక ఇప్పటికీ కూడా గాంధీజీ చిత్రంతోనే నోట్లు వస్తూ ఉన్నాయి.
గాంధీ ఫోటోనే ఎందుకు?
చాలా మంది గాంధీ ఫోటో ఎందుకుని.. వేరే ఫోటో పెట్టమని డిమాండ్ చేశారు. దీనిపై ఆర్బీఐ గతంలోనే స్పందించింది. సింహాల గుర్తువంటి స్థిర చిత్రాలను సులభంగా ఫోర్జరీ చేసే అవకాశముందని, నవ్వుతున్న గాంధీ బొమ్మలాంటి వాటిని ఫోర్జరీ చేయడం కష్టమని పేర్కొంది.
గాంధీ చిత్రం తప్ప మరొకరి చిత్రాన్ని ముద్రించకూడదని ఆర్బీఐ (RBI) కమిటీ కూడా నిర్ణయం తీసుకుంది. యావద్దేశ సంస్కృతి, ఆదర్శాలు, భిన్నత్వంలో ఏకత్వాన్ని గాంధీజీ ప్రతిబింబించినట్లు మరొకరు ప్రతిబింబించలేరని పేర్కొంది. దేశంలోని పలు ప్రాంతాలకు, జాతిమతాలకు వేర్వేరు మహా నాయకులు ఉన్నారని, అయితే అందరికీ అమోదనీయుడైన గాంధీ బొమ్మే నోట్లపై ఉండడం సముచితమని తెలిపింది. ఈ వివరాలను 2014లో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటు (Parliament) కు వెల్లడించారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.