శివసేన తిరుగుబాటు నేత, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన బలపరీక్షలో సీఎం షిండే నెగ్గారు. మ్యాజిక్ ఫిగర్ (144) కంటే ఎక్కువ ఓట్లు సాధించారు.
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం (Maharashtra Political Crisis) ముగిసింది. శివసేన తిరుగుబాటు నేత, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. అసెంబ్లీ సమావేశాల్లో (Maharashtra Assembly) భాగంగా సోమవారం నిర్వహించిన బలపరీక్షలో సీఎం షిండే నెగ్గారు. మ్యాజిక్ ఫిగర్ (144) కంటే ఎక్కువ ఓట్లు సాధించారు. షిండేను మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు సమర్థించారు. దీంతో ఆయన బలపరీక్షలో గెలుపొందినట్లు స్పీకర్ రాహుల్ నర్వేకర్ ప్రకటించారు. వివరాలివే..
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే శనివారం నాడు ప్రమాణస్వీకారం చేయగా, గవర్నర్ ఆదేశాల మేరకు బలపరీక్ష నిమిత్తం రెండు రోజుల అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆదివానం నాటి సభలో స్పీకర్ ఎన్నిక జరగ్గా.. బీజేపీ అభ్యర్థి రాహుల్ నర్వేకర్ గెలుపొందారు. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ బలపరీక్ష ప్రక్రియను చేపట్టారు. సభ్యులు నిలబడి ఉండగా తలలు లెక్కించే విధానంలో విశ్వాస పరీక్ష చేపట్టారు. సీఎం షిండేకు అనుకూలంగా 164 ఓట్లు రాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా 99 ఓట్లు పడ్డాయి. సభకు హాజరైనవారిలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనలేదు. మొత్తంగా 164-99 తేడాతో షిండే విశ్వాస పరీక్షలో నెగ్గారు.
నిజానికి రెబల్ నేత ఏక్నాథ్ షిండేను శివసేన నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించినప్పటికీ పార్టీ ఎమ్మెల్యేలంతా షిండేనే తమ నేతగా ఎన్నుకున్నారు. దీంతో ఉద్ధవ్ సైన్యంలేని శివసేనానిగా మిగిలిపోగా, పార్టీ దాదాపు షిండే హస్తగతమైనట్లయింది. అయితే, ఉద్ధవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే పార్టీ కైవసం అధికారికం కానుంది. సీఎం ఏక్నాథ్ షిండేను శివసేన శాసనసభా పక్ష నేతగా, చిఫ్విప్గా మరో తిరుగుబాటు నేత భరత్ గొగవాలేను గుర్తిస్తున్నట్లు అసెంబ్లీ సెక్రటేరియట్ ప్రకటించింది.
శివసేన పార్టీని షిండే వర్గం కైవసం చేసుకోవడం, వారిపై అనర్హత వేటు, విప్ జారీ అధికారలు తదితర అంశాలకు సంబధించి ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఈనెల 11న విచారణ కు రానుంది. సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష నిలిపేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న ఉద్ధవ్ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.