Maharashtra Rains: రాయగఢ్‌లో విషాదం.. కొండచరియలు విరిగిపడి 36 మంది మృతి

ప్రతీకాత్మక చిత్రం

Raigad landslides: నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు మూడు చోట్ల భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. మట్టి దిబ్బల కింద ఇళ్లు పూడుకుపోయాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 36 మంది మరణించారు

  • Share this:
    మహారాష్ట్రను భారీ వర్షాలు మంచెత్తాయి. ముఖ్యంగా కొంకణ్ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాల ధాటికి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద పోటెత్తడంతో చాలా గ్రామాలు నీట మునిగాయి. వర్షాల ధాటికి రాయగఢ్ జిల్లాలో విషాదం నెలకొంది. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు మూడు చోట్ల భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. మట్టి దిబ్బల కింద ఇళ్లు పూడుకుపోయాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 36 మంది మరణించారు. మరో 30 మంది ఇంకా మట్టి, బండరాళ్ల కింద చిక్కుకుపోయారు. మహద్ తాలుగా తలాయ్ గ్రామంలో 32 మంది, సఖర్ సుతార్‌‌వాడిలో మరో నలుగురు మరణించినట్లు రాయగడ్ జిల్లా కలలెక్టర్ నిధి చౌధరి తెలిపారు. ఘటనా స్థలాల్లో ఎన్టీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాయగఢ్ జిల్లాలోని చాలా గ్రామాలు జలదిగ్బంధంలో ఉండడంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, కోస్ట్‌గార్డ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.




    సతారా జిల్లాలోనూ కొండచరియలు విరిగిపడ్డాయి. 12 మంది వాటి కింద చిక్కుకున్నట్లు సమాచారం. వారిని కాపాడేందుకు సహాయక బృందాలు తీవ్రంగా కృష్టి చేస్తున్నాయి. గోవాలోని సత్తారి మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతానికి సమీపంలో ఉంటుంది. ఆ ప్రాంతాన్ని కూడా వరద ముంచెత్తింది. ఇళ్ల నుంచి బయటకు రాలేక.. ఇంట్లోనే నీటి మధ్య ఉండలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రజలు ఎటూ వెళ్లలేని పరిస్థితులు ఉండడంతో వారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముంబైలోని గోవండి ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో ఏడు మంది గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స పొందుతున్నారు. వర్షాలకు నానడం వల్ల భవనం కూలిపోయిందని అధికారులు తెలిపారు.

    గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడ్డాయి. సతారాలో మహాబలేశ్వర్‌లో 480 మి.మీ. వర్షం కురిసింది. 45 ఏళ్లలో ఇదే అత్యధిక వర్షపాతం కావడం విశేషం. ఇక మాతెరన్‌లో 330 మి.మీ. వాన పడింది. చాలా ప్రాంతాల్లో 200 మి.మీ.పైనే వానలు కురిశాయని అధికారులు తెలిపారు. వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మహారాష్ట్రలో వర్షాల పరిస్థితిపై ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో ప్రధాని నరేంద్ర మోదీ నిన్న రాత్రి మాట్లాడారు. రాష్ట్రంలో తాజా పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వరద సహాయక చర్యల్లో కేంద్రం తరపున అన్ని విధాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
    Published by:Shiva Kumar Addula
    First published: