MAHARASHTRA GOVERNMENT MAY MAKE BILL ON CONDUCTING ELECTIONS WITH BALLOT PAPERS ALONG WITH EVMS AK
మళ్లీ బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు.. చట్టం చేసే యోచనలో మహారాష్ట్ర సర్కార్
ప్రతీకాత్మక చిత్రం
Elections With Ballot Papers: ఒకవేళ థాక్రే ప్రభుత్వం ఈ రకమైన బిల్లును ప్రవేశపెడితే.. ఇలా చేసిన మొదటి ప్రభుత్వంగా నిలుస్తుంది. ప్రస్తుతం మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడీ కూటమిలోని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ పేపర్లను వినియోగించాలని కోరుతున్నాయి.
Elections With Ballot Papers: మహారాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ పేపర్ల వినియోగానికి సంబంధించి బిల్లు పెట్టాలని యోచిస్తోంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ మేరకు బిల్లు పెట్టే దిశగా ఆలోచిస్తోంది. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లును సిద్ధం చేయాలని తాను సీఎం ఉద్ధవ్ థాక్రేకు సూచించానని అసెంబ్లీ స్పీకర్ నానా పటోల్ న్యూస్ 18కు తెలిపారు. ఈవీఎంలతో పాటు బ్యాలెట్ పేపర్లు కూడా ఎన్నికల నిర్వహణకు వినియోగించేలా ఈ బిల్లు ఉంటుందని అన్నారు. ఒకవేళ ఇందుకు సంబంధించిన ముసాయిదా సిద్ధమైతే.. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడతామని అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ.. అది కేవలం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రమే వర్తించనుంది.
ఒకవేళ థాక్రే ప్రభుత్వం ఈ రకమైన బిల్లును ప్రవేశపెడితే.. ఇలా చేసిన మొదటి ప్రభుత్వంగా నిలుస్తుంది. ప్రస్తుతం మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడీ కూటమిలోని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ పేపర్లను వినియోగించాలని కోరుతున్నాయి. ఈవీఎంలను ట్యాంపర్ చేసే అవకాశం ఉందని కొన్నేళ్లుగా అనేక మంది నేతలు, రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. తమ ఓటమికి కారణం ఈవీఎంలే అని.. ఈవీఎం ఓట్ల ద్వారా బీజేపీ గెలిచిందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఈవీఎంలను ట్యాంపర్ అవుతాయనే ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. వీటిని ట్యాంపర్ చేయడం సాధ్యంకాదని పేర్కొంది.
ఉద్ధవ్ థాక్రే (File )
రాష్ట్రాలు ఈ రకమైన చట్టాలు చేయవచ్చా అనే అంశంపై కూడా అసెంబ్లీ స్పీకర్ పటోల్ స్పందించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 328 ప్రకారం ఎన్నికల నిర్వహణ విషయంలో ఈ రకమైన చట్టం చేసే హక్కు రాష్ట్రాలకు ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్ సహా వివిధ వర్గాలతో ఈ మేరకు చర్చలు జరిపామని అన్నారు. ఎన్నికలు ఈవీఎం ద్వారా నిర్వహించాలా లేక బ్యాలెట్ ద్వారా నిర్వహించాలా అనేది రాష్ట్రం నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న వాళ్లు, బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరుకునే వాళ్లు ఈ చర్య ద్వారా సంతోషిస్తారని తెలిపారు. దీనిపై ఎన్సీపీ నేత మజీద్ మెమన్ కూడా స్పందించారు. ఈవీఎం పారదర్శకతపై అనేక ఫిర్యాదు వచ్చాయని.. ఓటు వేసే ప్రజల నమ్మకాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.