మహారాష్ట్రలో కొద్దిరోజులుగా కొనసాగుతోన్న రాజకీయ సంక్షోభం (Maharashtra Crisis) తుది దశకు చేరింది. శివసేన పార్టీలో ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో ఎమ్మెల్యేల తిరుగుబాటు వల్ల మైనార్టీలో పడిపోయిన సంకీర్ణ సర్కారుకు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ కీలక ఆదేశాలిచ్చారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ కోరారు. గురువారం (రేపు) సాయంత్రమే మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని, ప్రక్రియ మొత్తాన్నీ వీడియోలో రికార్డు చేయాలనీ గవర్నర్ నిర్దేశించారు.
ఉద్ధవ్ ఠాక్రే సర్కారు బలపరీక్షకు ఆదేశించాల్సిందిగా బీజేపీ పక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ లేఖ ఇచ్చిన కొద్ది గంటలకే గవర్నర్ కోశ్యారీ ఆ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గురువారం ఉదయం 11 గంటలకు సమావేశమయ్యే ఏకైక అజెండా ఫ్లోర్ టెస్ట్ అని గవర్నర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
‘‘రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ దృశ్యం చాలా కలవరపెడుతోంది. 39 మంది ఎమ్మెల్యేలు మహారాష్ట్ర వికాస్ అగాధి ప్రభుత్వం నుంచి వైదొలగాలని ఆకాంక్షించారు. ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ఈమెయిల్ ద్వారా లేఖ పంపారు. ప్రతిపక్ష నాయకుడు కూడా కలుసుకున్నారు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని నాకు వివరించి, ఫ్లోర్ టెస్ట్ కోసం అడిగారు’’ అంటూ బలపరీక్ష ఆదేశాల్లో గవర్నర్ కోశ్యారీ వివరించారు.
అసెంబ్లీలో బలనిరూపణకు గవర్నర్ ఆదేశాలు వెలువడిన వెంటనే.. రెబల్ ఏక్ నాథ్ షిండే వర్గం తమ క్యాంపును గువాహటి(అస్సాం) నుంచి గోవాకు మార్చేసింది. మరికాసేపట్లో గోవాకు చేరుకోనున్న ఎమ్మెల్యేలు.. కలిసికట్టుగానే రేపు అసెంబ్లీకి హాజరవుతారని తెలుస్తోంది. మహా వికాస్ ఆఘాడీ(ఎంవీఏ) కూటమిలో భాగంగా.. కాంగ్రెస్, ఎన్‌సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శివసేనకు 55 స్థానాలు ఉండగా.. ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే వర్గంలో 39 మంది ఎమ్మెల్యేలున్నారు. స్వతంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు మరో 10 మంది కూడా ఆయన శిబిరంలో చేరారు. మెజార్టీ కోల్పోయిన ఉద్ధవ్ సర్కారు ఏ క్షణంలోనైనా పతనం అయ్యే పరిస్థితులు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Maharashtra, Shiv Sena, Uddhav Thackeray