బీజేపీని ఎదుర్కోవడానికి జాతీయస్థాయిలో మహాకూటమి ఏర్పాటవుతుందనేది ఒక భ్రమ మాత్రమే అని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ గెలిచి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో శివసేన తమతోనే ఉంటుందని అమిత్ షా అన్నారు. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని ముంబైలోని జరిగిన రిపబ్లిక్ సమ్మిట్ తెలిపారు. చాలామంది చెబుతున్నట్టుగా విపక్షాలతో కూడిన మహాకూటమి అనేది పూర్తి భిన్నమైనదని అమిత్ షా అన్నారు. అసలు మహాకూటమి అనేది లేనే లేదని... అదంతా ఓ భ్రమ అని వ్యాఖ్యానించారు. మహాకూటమి అనేది ఎక్కడా లేదన్న అమిత్ షా... 2014లోనూ వాళ్లందరితో తాము పోరాడి ఓడించామని అన్నారు. అసలు మహాకూటమి అంటున్న వారిలో ఎక్కువమంది ప్రాంతీయ నాయకులే అని వ్యాఖ్యానించిన అమిత్ షా... వారంతా ఒకరికొకరు సహకరించుకునే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు.
ప్రజల కోసం పనిచేయడం, వారిని కన్విన్స్ చేయడం తమ బాధ్యత అని అభిప్రాయపడిన అమిత్ షా... తీర్పు వ్యతిరేకంగా వచ్చినప్పుడు కూడా మనం వాటిని అంగీకరించాల్సిందే అని స్పష్టం చేశారు. తాను విశ్లేషణలకు వ్యతిరేకం కాదని... కానీ ఎన్నికలు వివిధ అంశాలపై జరుగుతుంటాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో అంశాలు భిన్నంగా ఉంటాయని అన్నారు.
2014లో బీజేపీ ఆరు రాష్ట్రాల్లో అధికారంలో ఉందన్న అమిత్ షా... ఇప్పుడు 16 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని తెలిపారు. దీన్ని బట్టి 2019లో ఎవరు అధికారంలోకి వస్తారో అంచనా వేయొచ్చని అభిప్రాయపడ్డారు. గడిచిన నాలుగేళ్ల కాలంలో తాము జాతీయ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని, అవినీతిని ఓడించామని తెలిపారు. ఎనిమిది కోట్ల ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించామని, రెండున్నర కోట్ల ఇళ్లకు విద్యుత్ అందించామని వివరించారు. బీజేపీకి మాత్రమే కాదు. దేశానికి సైతం ఓ బలమైన ప్రభుత్వం అధికారంలోకి రావడం ముఖ్యమని అమిత్ షా అన్నారు. నరేంద్రమోదీకి పోటీగా ప్రధాని అభ్యర్థిగా ఎవరు నిలబడతారనేది పెద్ద విషయం కాదని అమిత్ షా అన్నారు. బీజేపీ తన బలాన్ని నమ్ముకుందని... ఎవరి బలహీనతల మీద ఆధారపడటం లేదని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Bjp, Congress, Mahakutami, Narendra modi, Pm modi