Nithyananda: నిత్యానంద ప్రకటనతో వివాదం.. మధురై అధీనం గదులు సీజ్..

గదులను సీజ్ చేస్తున్న అధికారులు

Nithyananda: ఇటీవల వివాదాస్పద మతగురువు నిత్యానంద చేసిన ప్రకటన తమిళనాడు రాష్ట్రంలో పెద్ద దుమారమే రేపుతోంది. మధురై అధీనం తదుపరి పీఠాధిపతిగా తనని తాను ప్రకటించుకుంటూ నిత్యానంద ఒక ప్రకటన విడుదల సంగతి విధితమే. ఈ క్రమంలో గురువారం రాత్రి మధురై అధీనం గదులకు అధికారులు సీల్ వేశారు.

  • Share this:
ఇటీవల వివాదాస్పద మతగురువు నిత్యానంద చేసిన ప్రకటన తమిళనాడు రాష్ట్రంలో పెద్ద దుమారమే రేపుతోంది. మధురై అధీనం తదుపరి పీఠాధిపతిగా తనని తాను ప్రకటించుకుంటూ నిత్యానంద ఒక ప్రకటన విడుదల సంగతి విధితమే. ఈ క్రమంలో గురువారం రాత్రి మధురై అధీనం గదులకు అధికారులు సీల్ వేశారు. అధీనం పరిధిలోని దేవాలయాలకు సంబంధించిన ఆస్తి పత్రాలను ఎవరూ తీసుకోవడానికి వీలు లేకుండా గదులు మూసివేసినట్లు సమాచారం. నాలుగు రోజుల క్రితం మధురై అధీనం 292వ పీఠాధిపతిగా సేవలందిస్తున్న అరుణగిరినాథర్ అనారోగ్యం పాలయ్యారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనను ఆగస్టు 9న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. పరిస్థితి మరింత విషమించడంతో ఈ గురువారం ఐసీయూ వార్డుకు తరలించారు. ఈ క్రమంలోనే నిత్యానంద.. పీఠాధిపతి అరుణగిరినాథర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఒక ప్రకటన విడుదల చేశాడు. అలాగే, మధురై అధీనం 293వ పీఠాధిపతిగా తనని తాను ప్రకటించుకున్నాడు.

ఏప్రిల్ 27, 2012న అరుణగిరినాథర్ తనను యువ పీఠాధిపతిగా అధికారికంగా నియమించినట్టు నిత్యానంద తెలిపారు. అయితే మళ్ళీ అరుణగిరినాథరే 2012 డిసెంబర్ 19న నిత్యానందను యువ పీఠాధిపతి స్థానం నుంచి తొలగించారని సమాచారం. మద్రాస్ హైకోర్టులో మధురై బెంచ్‌లో కేసులు ఉన్నాయని నిత్యానందతో పాటు ఇద్దరు యువ పీఠాధిపతు‌లను తొలగించారు. ఈ కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. వెయ్యేళ్ల చరిత్ర గల ఈ మధురై అధీనం అత్యంత పురాతన శైవ (హిందూ పీఠాల్లో) పీఠాల్లో ఒకటిగా వెలుగొందుతోంది. ఈ పురాతన అధీనానికి త్రిమన్ నాయనార్ (శివుని శిష్యులు)లలో ఒకరైన తిరుజ్ఞాన సంబంధర్ పూర్వవైభవం తెచ్చారు.

దీనికి తంజావూరు జిల్లాలోని నాలుగు దేవాలయాల వారసత్వ ధర్మకర్తగా ఉన్న అరుణగిరినాథ జ్ఞానసంబంధ దేశిక పరమాచార్య.. 1980 నుంచి పీఠాధిపతిగా సేవలందిస్తున్నారు. గతంలో ఈయన తమిళ దినపత్రికతో పాటు డీఎంకే పత్రిక అయిన 'మురసోలి'లో పాత్రికేయుడిగా పనిచేసారు. చాలా సందర్భాల్లో ఆయన జయలలితకు మద్దతు కూడా తెలిపారు. ఇదిలా ఉండగా.. అరుణగిరినాథర్ వారసుడిగా నిత్యానంద స్వీయ ప్రకటన చేసుకోవడంతో మీనాక్షి సుందరేశ్వర ఆలయం సమీపంలో ఉన్న మధురై అధీనం గదులను మూసివేశారు. గురువారం రాత్రి, మైలాడుతురైకి చెందిన ధర్మపురం అధీనం సమక్షంలో గదులను సీల్ చేశారు.
Published by:Veera Babu
First published: