MADRAS HIGH COURT HAS ORDERED THAT THE PROVISION OF FOOD IN GLOVES SHOULD BE MADE COMPULSORY SU
చేతికి గ్లౌజులు ధరించడం తప్పనిసరి.. హైకోర్టు ఆదేశం.. ఎక్కడంటే.. పూర్తి వివరాలు ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
కరోనా కారణంగా.. బయటకు వెళ్లినప్పుడు ఫేస్ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం చాలా మంది చేస్తూనే ఉన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో అవతలి వ్యక్తుల అజాగ్రత్త వల్ల కూడా కరోనా వైరస్(Coronavirus) వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదు.
కరోనా కారణంగా ప్రజల జీవన విధానంలో పలు మార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బయటకు వెళ్లినప్పుడు ఫేస్ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం చాలా మంది చేస్తూనే ఉన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో అవతలి వ్యక్తుల అజాగ్రత్త వల్ల కూడా కరోనా వైరస్(Coronavirus) వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే రెస్టారెంట్లు, బేకరీలు, కిరాణా దుకాణాలలో పనిచేసే సిబ్బంది.. ఉమ్మితో పేపర్లను వేరుచేయడం, కవర్లను ఓపెన్ చేసేందుకు వాటిలోని నోటితో గాలిని ఊదడం ద్వారా కరోనా సంక్రమించే ప్రమాదం ఉందని ఆరోపిస్తూ తమిళనాడులోని తిరుచెందూరుకు చెందిన న్యాయవాది రామ్‌కుమార్ ఆదిత్యన్.. మద్రాస్ హైకోర్టు(Madras High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఆహార పదార్థాలను పార్సిల్ చేసేటప్పుడు లాలాజలం, నోటి ద్వారా గాలి ఊదడం ఆహారాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్ బెనర్జీ(Justice Sanjib Banerjee), న్యాయమూర్తి జస్టిస్ ఆదికేశవులు(Justice Adikesavulu)తో కూడిన ధర్మాసం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే క్యాటరింగ్/ఆహార పదార్థాలకు సంబంధించిన స్టాల్స్ నిర్వహించే వారు లాలాజలం ఉపయోగించరాదని ప్రభుత్వం తరఫున ఆదేశాలు జారీచేసినట్టుగా రాష్ట్ర సర్కార్ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అయితే పిటిషన్ మాత్రం.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం మాత్రమే సరిపోదని, ఇందుకు సంబంధించి తగిన ప్రచారం, అవగాహన కల్పించాలని కోరారు.
అనంతరం ఉతర్వులు జారీచేసిన హైకోర్టు ధర్మాసనం.. క్యాటరింగ్ విభాగంలో ఉన్నవారు గ్లోవ్స్ వాడకాన్ని తప్పనిసరి చేయాలని, ప్రజల ఆరోగ్యం విషయంలో రాజీ పడొద్దని సూచించింది. ఆహారాన్ని తయారుచేసేటప్పుడు, లేక వడ్డించేటప్పుడు పరిశుభ్రత పాటించాలని, ఇటువంటి విషయాలలో రాజీపడవద్దని తెలిపింది. ఆహార పంపిణీ విభాగంలో ఉన్నవారికి గ్లోవ్స్ వాడకాన్ని తప్పనిసరి చేయాలని హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని(Tamil Nadu Government) ఆదేశించింది.
ముందు జాగ్రత్త చర్యలు ఉత్తమని గ్రహించి.. ఆహార భద్రత, ఆరోగ్య శాఖ కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ పంపాలని ఆదేశించింది. ఈ ఆదేశాల అమలును పర్యవేక్షించడానికి ఆహార భద్రతా అధికారిని నోడల్ ఆఫీసర్‌గా నియమించాలని తెలిపింది. అవగాహన చర్యలు చేపట్టాలని సూచించింది. తద్వారా ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ధర్మాసనం ముగించింది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.