MADRAS HC QUASHES ACQUISITION OF VEDA NILAYAM FOR JAYALALITHAA MEMORIAL IT WILL GOTO HER LEGAL HEIRS MKS
Jayalalithaa : అమ్మ వేదనిలయం వారసులకే -స్మారకం పేరుతో అన్నాడీఎంకే స్వాధీనం చెల్లదన్న హైకోర్టు
జయలలిత వేద నిలయం భవంతి
చెన్నై నగరంలోని పోయెస్ గార్డెన్ లో గల ‘అమ్మ’ జయలలిత నివాసం ‘వేద నిలయం’ ఆమె వారసులకే చెందుతుందని హైకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. ఈ బంగళాను స్మారక కేంద్రంగా మార్చుతూ గత ఏఐఏడీఎంకే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కోర్టు రద్దు చేసింది.
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆస్తులకు సంబంధించి మద్రాస్ హైకోర్టు (Madras High Court) కీలక తీర్పు వెలువరించింది. చెన్నై నగరంలోని పోయెస్ గార్డెన్ లో గల ‘అమ్మ’ జయలలిత నివాసం ‘వేద నిలయం’ ఆమె వారసులకే చెందుతుందని హైకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. ఈ బంగళాను స్మారక కేంద్రంగా మార్చుతూ గత ఏఐఏడీఎంకే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కోర్టు రద్దు చేసింది. అమ్మ మరణం తర్వాత వర్గ విభేదాలు తలెత్తి చివరికి బీజేపీ పంచన చేరిన అన్నాడీఎంకే అసలే ఎన్నికల్లో ఓడిపోగా, ఇప్పుడు వేదనిలయం కూడా చేజారడం షాకింగ్ పరిణామంగా మారింది.
జయలలిత నివాసం వేదనిలయం భవంతి ముమ్మాటికీ ఆమె వారసులకే చెందుతుందన్న హైకోర్టు.. వెంటనే దానికి వారసులకే అప్పగించాలని అన్నాడీఎంకేను ఆదేశించింది. జయలలిత మేనల్లుడు జే దీపక్, మేన కోడలు జే దీప దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ ఎన్ శేషశాయి బెంచ్ విచారణ జరిపి ఈ మేరకు ఇవాళ ఆదేశాలిచ్చింది. చెన్నై సిటీలోని ఆళ్వార్ పేటలోని పొయెస్ గార్డెన్లో వేద నిలయం ఉంది. దీనిని స్మారక కేంద్రంగా మార్చడం కోసం గత ఏఐఏడీఎంకే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ ఆదేశాలను రద్దు చేస్తున్నట్లు జస్టిస్ ఎన్ శేషశాయి తీర్పు చెప్పారు.
ప్రభుత్వం జమ చేసిన నష్టపరిహారం సొమ్మును తిరిగి ప్రభుత్వానికి వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించిన కోర్టు.. జయలలిత చట్టబద్ధ వారసులకు వేద నిలయాన్ని మూడు వారాల్లోగా అప్పగించాలని చెన్నై జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. దివంగత జయలలిత చెల్లించవలసిన పన్నులు బాకీ ఉంటే, వాటి వసూలుకు తగిన చర్యలు తీసుకోవచ్చునని ఆదాయపు పన్ను శాఖకు తెలిపారు. వేద నిలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను రద్దు చేస్తూ, ఆమె పేరు మీద రెండు స్మారక కేంద్రాలు ఉండవలసిన అవసరం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది.
24,322 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న వేద నిలయంలో జయలలిత దాదాపు 40 సంవత్సరాలు నివసించారు. తమిళనాడు రాజకీయాల్లో జరిగిన అనేక చారిత్రక నిర్ణయాలకు వేద నిలయం వేదికగా నిలిచింది. వేద నిలయాన్ని స్మారక కేంద్రంగా మార్చుతామని 2017లో అప్పటి ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రకటించారు. దీనిని లాంఛనంగా ప్రారంభించినప్పటికీ, సందర్శించేందుకు ప్రజలకు అనుమతి ఇవ్వలేదు. అదే సమయంలో జయలలితకు చట్టబద్ధ వారసులుగా దీప, దీపక్‌లను గుర్తిస్తూ అధికారిక ప్రకటన రావడంతో, వారిద్దరూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి, వేద నిలయాన్ని తమకే ఇవ్వాలని కోరారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.