తమిళనాడు మాజీ సీఎం జయలలిత వారసులుగా ఆమె మేనల్లుడు జే.దీపక్, మేనకోడలు జే.దీపను ప్రకటించింది మద్రాస్ హైకోర్టు. దీంతో ఆమె ఆస్తులకు వారు అధికారికంగా వారుసులు అయ్యారు. చెన్నైలో ఉన్న జయలలిత నివాసంలో కొంత భాగాన్ని ఆమె స్మారకంగానూ, మరికొంత భాగాన్ని (వేద నిలయం) ముఖ్యమంత్రి కార్యాలయంగానూ మార్చాలని హైకోర్టు సూచించింది. తమ సూచనలపై సమాధానం ఇవ్వాల్సిందిగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు ఎనిమిది వారాల గడువు ఇచ్చింది. హైకోర్టు జడ్జిలు జస్టిస్ ఎన్.కిరుబకరణ్, జస్టిస్ అబ్దుల్ ఖుద్దోస్‌లతో కూడిన బెంచ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. జయలలిత ఆస్తుల పరిరక్షణకు ఓ పరిపాలన బృందాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. మరోవైపు జయలలితకు తమను వారసులుగా ప్రకటించాలని దీప, దీపక్ దాఖలు చేసిన పిటిషన్‌కు కోర్టు ఆమోదం తెలిపింది. కోర్టు తీర్పుపై దీప హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత తన సోదరుడు దీపక్‌కు చెందుతుందన్నారు. జయలలిత నివాసాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చిన తర్వాత కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. జయలలిత నివాసాన్ని మెమోరియల్‌గా మారుస్తామని ప్రభుత్వం ఆ ఆర్డినెన్స్‌లో పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jayalalithaa, Tamil nadu