ఆ అసెంబ్లీలో 'పప్పూ పదంపై నిషేధం'.. దొంగ, వ్యభిచారుడు, భ్రష్టుడు.. ఇంకా ఏయే పదాలు ఉన్నాయో తెలుసా?

'పప్పూ' పదం వాడకంపై బుక్‌లెట్ విడుదల చేసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం (Twitter/ANI)

ప్రతిపక్ష, అధికార పార్టీ నేతలు ఒకరిపై మరొకరు అభ్యంతరకరమైన పదాలను వాడుతుంటారు. అయితే చట్టసభల్లో అటువంటి పదాలను ఉచ్చరించకూడదని మధ్యప్రదేశ్ ప్రభుత్వం పేర్కొన్నది. ఏయే పదాలు అన్‌పార్లమెంటరీ కిందకు వస్తాయో సూచిస్తూ ఒక బుక్‌లెట్ విడుదల చేసింది.

  • Share this:
ప్రతిపక్ష, అధికార పార్టీ నేతలు ఒకరిపై మరొకరు అభ్యంతరకరమైన పదాలను వాడుతుంటారు. అయితే చట్టసభల్లో అటువంటి పదాలను ఉచ్చరించకూడదని మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. వర్షాకాల సమావేశాల సందర్భంగా అన్‌పార్లమెంటరీ పదాలలో నూతనంగా 38 పదాలు/ పదబంధాలు/ వాక్యాలను చేర్చింది. ఈ పదాలతో కూడిన ఒక కొత్త బుక్‌లెట్‌ను విడుదల చేసింది. ఇందులో రాహుల్ గాంధీని పరోక్షంగా పిలిచే ‘పప్పూ’.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యులు దిగ్విజయ్ సింగ్‌ని పిలిచే ‘మిస్టర్‌ బంటాధార్’ పదాలను కూడా చేర్చింది.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సరికొత్త బుక్‌లెట్‌ను రాజకీయ నేతలకు ఇవ్వనుంది. పార్లమెంటరీ, రాష్ట్ర అసెంబ్లీలలో సభ్యులు మాట్లాడే భాష హుందాగా ఉండాలని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం అభిప్రాయపడింది. శాసనసభ్యులు మర్చిపోయి అన్‌పార్లమెంటరీ పదాలు వాడతారని.. అందుకే వారంతా మాట్లాడే ముందు ఈ బుక్‌లెట్‌ను చదవాలని సూచించింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విధాన సభ ఏర్పాటైనప్పటి నుంచి 1,161 అన్‌పార్లమెంటరీ పదాలు తొలగించారు. కొత్తగా డోంగీ (మోసగాడు), నీకమ్మా (పనికిరాని), చోర్‌ (దొంగ), భ్రస్ట్‌ (అవినీతిపరుడు), గూండా వంటి హిందీ పదాలను అన్‌పార్లమెంటరీ పదాల జాబితాలో చేర్చారు. అలాగే జూత్ బోల్నా (అబద్ధం చెప్పడం), వ్యభిచర్ కర్ణ (వ్యభిచారానికి పాల్పడటం) వంటి పదబంధాలను పొందుపరిచారు. ఇక సాసుర్ (మామ) అనే పదాన్ని కూడా అన్‌పార్లమెంటరీ పదంగా పేర్కొన్నారు.

ఈ బుక్‌లెట్‌ను ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నరోత్తమ్‌ మిశ్రా, అసెంబ్లీ స్పీకర్ గిరీష్ గౌతమ్ కలిసి ఆదివారం విధానసభ భవన్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఒకప్పుడు కొందరు విద్యార్థులు విధానసభ అనేది ఒక చేపలు మార్కెట్ గా ఉందని తనతో అన్నట్లు గుర్తు చేసుకున్నారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకూడదని ఆయన అన్నారు. రీటేక్‌ల సౌకర్యం నటులకు అందుబాటులో ఉంటుంది కానీ నాయకులకు కాదు, ప్రజా వేదికలపై జాగ్రత్తగా మాట్లాడాలని స్పీకర్ గిరీష్ గౌతమ్ సూచించారు.

పార్లమెంలు, విధాన సభ వేదికలను ప్రజాస్వామ్యం దేవాలయాల అభివర్ణించిన కమల్‌ నాథ్‌.. అన్‌పార్లమెంటరీ పదాలపై బుక్ విడుదల చేసే దుస్థితి ఎందుకు వచ్చింది అని ప్రశ్నించారు. కొన్ని కారణాల వల్ల 1990 - 2014 మధ్య రికార్డులు అందుబాటులో లేకుండా పోయాయని రాష్ట్ర అసెంబ్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎపీ.సింగ్ చెప్పుకొచ్చారు. రెండవ ఎడిషన్‌లో మిస్ అయిన అన్ని పదాలను చేర్చి విడుదల చేస్తామని చెప్పారు.
Published by:John Naveen Kora
First published: