ఎన్నికల్లో పోటీ చేస్తున్న కొందరు నేతల ఆస్తుల లెక్కలు చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్ముతాయి. పలువురు నేతలు తమకు వందల కోట్లలో ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో అధికారికంగానే ప్రకటిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని చింద్వారా లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నకుల్ నాథ్... తన పేరు మీద తన భార్య ప్రియ పేరు మీద మొత్తం రూ. 660 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నట్టుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీమంత్రి కమల్‌నాథ్ తనయుడే నకుల్ నాథ్. మధ్యప్రదేశ్‌కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చింద్వారా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన నకుల్‌నాథ్... ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చింద్వారా నుంచి ఎంపీగా బరిలో నిలిచారు.
ఇక తన కుమారుడు రాజీనామా చేసిన ఎమ్మెల్యే పదవి కోసం కమల్‌నాథ్ పోటీ పడుతున్నారు. మంగళవారం చింద్వారా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కమల్‌నాథ్, చింద్వారా లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన తనయుడు నకుల్‌నాథ్ నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కమల్‌నాథ్... తాను, తన భార్య ఇద్దరికి కలిపి రూ. 124.50 కోట్ల ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో వెల్లడించారు. అయితే గతంతో పోలిస్తే ఆయన ఆస్తులు తగ్గాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో తన పేరు మీద మొత్తం రూ. 206.50 కోట్ల ఆస్తులు ఉన్నట్టు కమల్‌నాథ్ ప్రకటించారు. అయితే తండ్రీకొడుకులైన కమల్‌నాథ్, నకుల్‌నాథ్ ఇద్దరి ఆస్తలు కలిపితే దాదాపు రూ. 780 కోట్లకు పైనే ఉండటం గమనార్హం.
Published by:Kishore Akkaladevi
First published:April 10, 2019, 18:12 IST