‘ఉగ్రవాది కసబ్‌తో భారత్ మాతా కీ జై అనిపించా’

ముంబై జైల్లో ఉన్నప్పుడు కసబ్‌కు వడ్డించే ఆహారం, చివరకు మంచినీళ్లు కూడా పోలీసుల బాక్సుల్లో నుంచే ఇచ్చేవారని తెలిపారు.

news18-telugu
Updated: February 20, 2020, 3:53 PM IST
‘ఉగ్రవాది కసబ్‌తో భారత్ మాతా కీ జై అనిపించా’
అజ్మల్ కసబ్ (File)
  • Share this:
భారత్ మీద దాడి చేసి అమాయకులను పొట్టనపెట్టుకున్న పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌తో తాను భారత్ మాతాకీ జై అనిపించినట్టు ఓ పోలీస్ అధికారి పేర్కొన్నారు. గతంలో ముంబై పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన రాకేష్ మారియా ఈ విషయాన్ని వెల్లడించారు. తన ఆత్మకథ ‘Let me Say it Now’లో రాకేష్ మారియా ఈ మేరకు కొన్ని విషయాలను వెల్లడించారు. దీంతోపాటు భారత్‌లో ముస్లింలు స్వేచ్ఛగా మసీదుల్లో ప్రార్థనలు చేసుకోవచ్చునని కూడా అతడికి నిరూపించినట్టు తెలిపారు.

‘ఆ రోజు కసబ్ ఉన్న కాన్వాయ్ మెట్రో జంక్షన్ వద్దకు వచ్చి ఆగింది. కొన్ని రోజుల క్రితమే అక్కడ ఆ ఉగ్రవాది మారణహోమం సృష్టించాడు. ఎంతోమంది నా సహచరుల్ని పొట్టనపెట్టుకున్నాడు. డజన్ల కొద్ద ప్రజల ప్రాణాలు తీశాడు. కసబ్ అక్కడకు వచ్చాక నేల మీద కూర్చుని నుదుటిని నేలకు తాకించమని ఆదేశించా. అతడు నేను చెప్పినట్టే చేశాడు. ఇప్పుడు భారత్ మాతాకీ జై అను. అని ఆదేశించా. కసబ్ ‘భారత్ మాతాకీ జై’ అన్నాడు. అంతటితో అయిపోలేదు. మరో రెండుసార్లు అలా అనిపించా.’ అని రాకేష్ మారియా తన ఆత్మకథలో పేర్కొన్నారు.

పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాది కసబ్ చిన్ననాటి నుంచి భారత్ మీద ద్వేషం ఉందని, ఇండియాలో మసీదులన్నీ మూసేశారని, అక్కడ ముస్లింలు స్వేచ్ఛగా ప్రార్థనలు కూడా చేసుకోలేకపోతున్నారనే భ్రమలో ఉన్నాడని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ముంబైలోని క్రైం బ్రాంచ్ లాకప్‌లో అతడికి రోజుకు ఐదుసార్లు ముస్లింల ప్రార్థన (అజా) వినిపించేది. కానీ, అదంతా అతడిని భ్రమింపజేయడానికి అలా చేస్తున్నామని అనుకునేవాడు. ఈ విషయం మాకు తెలిసిన తర్వాత నేను ఇన్‌స్పెక్టర్ మహాలేను ఆదేశించా. మెట్రో సినిమాకు దగ్గరలోనే ఉన్న ఓ మసీదుకు అతడిని వాహనంలో తీసుకెళ్లాం. అక్కడ ముస్లింలు ప్రార్థన చేసుకుంటున్నది తన కళ్లతో తానే చూసిన తర్వాత అతడు దాన్ని నమ్మలేకపోయాడు.’ అని రాకేష్ మారియా తన ఆత్మకథలో రాశారు.

ఉర్దూ మీడియంలో నాలుగో తరగతి వరకు మాత్రమే చదివిన కసబ్ ఇంట్లో నుంచి పారిపోవడానికి, రావల్పిండిలో లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాదులను కలవడానికి పేదరికమే కారణమని రాకేష్ మారియా అభిప్రాయపడ్డారు. ‘లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాదులు దీన్ని ‘హిందు టెర్రర్’గా చూపించాలనుకున్నారు. బెంగళూరుకు చెందిన సమీర్ దినేష్ చౌదురి పేరుతో కసబ్‌కు ఓ గుర్తింపు కార్డు కూడా తీశారు. అతడి చేతికి ఓ ఎర్రదారం కూడా ఉంది. వారి ప్లాన్ అంతా అనుకున్నట్టు జరిగి.. కసబ్ కూడా చనిపోయి ఉంటే అప్పుడు అతడు కూడా ఓ హిందువుగా మరణించి ఉండేవాడు. మేం అతడిని సజీవంగా పట్టుకుని విచారించిన తర్వాత అసలు నిజం వెలుగుచూసింది.’ అని రాకేష్ మారియా తెలిపారు.ముంబై జైల్లో ఉన్నప్పుడు కసబ్‌కు వడ్డించే ఆహారం, చివరకు మంచినీళ్లు కూడా పోలీసుల బాక్సుల్లో నుంచే ఇచ్చేవారని తెలిపారు. కసబ్ ప్రాణాలకు ముప్పు ఉందని, ముంబై మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ ద్వారా అతడిని చంపించే ప్రయత్నం చేస్తున్నారని ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో తాము చాలా జాగ్రత్త వహించామని వెల్లడించారు.
First published: February 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు