ఓబీసీ జాబితాలను ఖరారు చేసే అధికారం రాష్ట్రాలకు కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేపట్టింది. నిన్ని ఈ బిల్లును కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం ఓబీసీ కులాలను గుర్తించే పూర్తి అధికారాలు రాష్ట్రాలే లభిస్తాయి. ఈ బిల్లుకు విపక్షాలు కూడా మద్దతు ప్రకటించాయి. గతంలో చేసిన తప్పులను కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సరిదిద్దుకుందని కాంగ్రెస్ లోక్ సభ ప్రతిపక్షనేత అధీర్ రంజన్ చౌదరి అన్నారు. మరాఠా రిజర్వేషన్లపైనా కేంద్రం దృష్టి పెట్టాలని ఆయన కోరారు.
టీఆర్ఎస్, బీజేడీ, ఎల్‌జేపీ, జేడీయూ ఈ బిల్లును ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేశాయి. హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌లలో రిజర్వేషన్ల సమస్యను ఇది పరిష్కరిస్తుందని నేతలు తెలిపారు. మరోవైపు శివసేన ఎంపీ వినాయక్ రౌత్ మరాఠాల రిజర్వేషన్లపై గళం వినిపించారు. కులాల వారీగా జనగణన చేపట్టాల్సిందిగా వైసీపీ ఎంపీ చంద్రశేఖర్ కేంద్రాన్ని కోరారు. బిల్లుకు మద్దతు తెలిపిన తృణమూల్ పార్టీ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ.. పెగాసస్ మీద కూడా చర్చకు ఒప్పుకొంటే ఇప్పుడు జరుగుతున్నట్టే సమావేశాలు సాఫీగా సాగుతాయని అన్నారు. 30 బిల్లులను కేవలం 10 నిమిషాల్లోనే ఎలా పాస్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. కేవలం 11 శాతం బిల్లులనే కమిటీలు పరిశీలించాయన్నారు.
ఓబీసీల రిజర్వేషన్ల కోసం డీఎంకే పోరాడిందని ఆ పార్టీ ఎంపీ బాలు గుర్తు చేశారు. మరోవైపు ఓబీసీలకు కాంగ్రెస్ ఎలాంటి రిజర్వేషన్లను ఇవ్వలేదని, కాకా కాలేల్కర్ కమిషన్ సిఫార్సులను అమలు చేయలేదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గుర్తు చేశారు. దివంగత అటల్ బిహారీ వాజ్ పేయిఓబీసీల క్రీమీలేయర్ పరిమితిని పెంచారని వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Lok sabha