ఎంపీల జీతంలో 30శాతం కోత...సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

లోక్‌సభ (ప్రతీకాత్మక చిత్రం)

కరోనా పరిస్థితుల కారణంగా దేశంలో నెలకొన్న ఆర్థిక విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత విధించే సవరణ బిల్లుకు లోక్‌సభ మంగళవారం ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. 

  • Share this:
    కరోనా పరిస్థితుల కారణంగా దేశంలో నెలకొన్న ఆర్థిక విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎంపీల వేతనాల్లో కేంద్ర ప్రభుత్వం 30 శాతం కోత విధించింది. దీనికి సంబంధించిన సవరణ బిల్లుకు లోక్‌సభ మంగళవారం ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.  కొవిడ్‌పై పోరాటంలో నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో ఏడాది పాటు ఎంపీల వేతనాల్లో 30శాతం కోత విధిస్తూ కేంద్ర కేబినెట్‌ ఏప్రిల్ మాసంలో నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఎంపీల వేతనాలు, పింఛన్లలో 30 శాతం కోతకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను ఏప్రిల్‌ 6న కేంద్ర కేబినెట్‌ విడుదల చేిసంది. ఎంపీల వేతనాల్లో 30శాతం కోతకు సంబంధించిన సవరణ బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టగా...దీన్ని మంగళవారం సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రధాని, కేంద్రమంత్రులతో పాటు ఎంపీలందరి వేతనాల్లో 2020 ఏప్రిల్‌ 1 నుంచి ఏడాది పాటు ఈ కోత అమలులో ఉంటుంది.

    అటు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి సహా పలువురు గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు కూడా స్వచ్ఛందంగా వేతనాల కోతకు ముందుకొచ్చారు. కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎంపీ ల్యాడ్స్‌ నిధులను కూడా రెండేళ్ల పాటు తాత్కాలికంగా రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
    Published by:Janardhan V
    First published: