Lok Sabha Election 2019 : లోక్ సభ ఎన్నికల రెండో దశలో మొత్తం 11 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో 95 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. మధురైలో మాత్రం ఉత్సవాల నేపథ్యంలో రాత్రి 8గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. బెంగాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. అలాగే, పశ్చిమ బెంగాల్లోనే అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైనట్టు అంచనా. జమ్మూకాశ్మీర్‌లో అత్యల్పంగా పోలింగ్ శాతం నమోదైంది. కర్ణాటకలోని మాండ్యాలో ఎన్నికల సందర్భంగా హింస తలెత్తింది. స్వతంత్ర అభ్యర్థి సుమలత, జేడీఎస్ వర్గాల మధ్య గొడవలు జరిగాయి. తమిళనాడులో సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులోని కడలూరు లోక్‌సభ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్‌లో అభ్యర్థి పేరు పక్కన బటన్ లేకపోవడంతో ఆ బూత్‌లో ఎన్నికను వాయిదా వేశారు.
తమిళనాడు 38 (వేలూరు ఎన్నిక వాయిదా) పుదుచ్చేరి 1, కర్ణాటక 14, మహారాష్ట్ర 10, ఉత్తరప్రదేశ్ 8, అసోం 5, బీహార్ 5, ఒడిశా 5, ఛత్తీస్‌గఢ్ 3, బెంగాల్ 3, కాశ్మీర్ 2, మణిపూర్ 1, స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే... ఒడిశాలోని 35 అసెంబ్లీ స్థానాలకు కూడా రెండో దశలోనే ఎన్నికలు జరగుతున్నాయి. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలుండగా, 14 సీట్లకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దశలో జమ్మూకాశ్మీర్ సహా చాలా చోట్ల సమస్యాత్మక ప్రాంతాలు ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.
Read More