Home /News /national /

LOK SABHA ELECTIONS 2019 BALLOT ELECTION IN NIZAMABAD 178 FARMERS TO CONTEST AGAINST KAVITHA SK

కవితపై 178 మంది రైతులు పోటీ..నిజామాబాద్‌లో బ్యాలట్ పోలింగ్

ఎంపీ కవిత ప్రచారం

ఎంపీ కవిత ప్రచారం

అభ్యర్థుల లెక్క తేలడంతో బ్యాలట్ ఏర్పాట్లలో మునిగిపోయారు అధికారులు. ఎన్నికల్లో పోటీచేసే 185 మంది అభ్యర్థులందరికీ గుర్తులు అందుబాటులో ఉన్నాయని ఎన్నికలు అధికారులు వెల్లడించారు. వారికి గుర్తు కేటాయించే పనిలో నిమగ్నమయ్యారు.

    (పి.మహేందర్, నిజామాబాద్ రిపోర్టర్, న్యూస్ 18)

    తెలంగాణ ప్రజలందరి దృష్టి ఇప్పుడు నిజామాబాద్‌పైనే ఉంది. ఎన్నికల్లో ఈ లోక్‌స్థానంపైనే జోరుగా చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ కూతురు కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్‌లో భారీ సంఖ్యలో రైతులు పోటీచేస్తుండడమే దీనికి కారణం..! ఐతే కవితపై ఎంత మంది పోటీచేస్తున్నారన్న విషయలో క్లారిటీ వచ్చింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో అభ్యర్థుల లెక్కతేలింది. నిజామాబాద్‌లో కవిత సహా మొత్తం 185 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. వీరిలో 178 మంది పసుపు, ఎర్రజొన్న రైతులే కావడం విశేషం.

    టీఆర్ఎస్ నుంచి క‌విత‌, కాంగ్రెస్ నుంచి మ‌ధయాష్కిగౌడ్, బీజేపీ నుంచి ధర్మపురి అర‌వింద్, పిరమిడ్‌, బహుజన ముక్తి, సమాజ్‌వాదీ పార్టీల‌తో పాటు ఒక‌ స్వతంత్ర అభ్యర్థి కలిపి మరో ఏడుగురు బరిలో ఉన్నారు. రైతుల‌ను పోటీ నుంచి విర‌మించేదుకు అధికార పార్టీ నాయ‌కులు చేసిన ప్రయ‌త్నాలన్నీ విఫ‌లం అయ్యాయి. రైతులు పోటి నుంచి త‌ప్పుకునేందుకు స‌సేమీరా అన్నారు. దాంతో లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌లో ఎంపీ కవితపై 178 మంది రైతులు పోటీచేయబోతున్నారు.

    నిజామాబాద్ జిల్లా రైతులు గ‌త కొంత కాలంగా పసుపు, ఎర్రజొన్నల పంట‌ల‌కు మ‌ద్దతు ధ‌ర కోసం ఆందోళనలు ధర్నాలు చేశారు. పలు రూపాల్లో నిరసన వ్యక్తంచేసినా కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవ‌డంతో రైతులు పార్లమెంట్ ఎన్నిక‌ల్లో పోటీచేయాలని నిర్ణయం తీసుకున్నారు. తమ సమస్యను దేశం దృష్టిని తీసుకొచ్చేందుకు పెద్ద మొత్తంలో నామినేష‌న్లు వేసారు. అయితే వీరిలో ఎంతమంది పోటిలో ఉంటారని? ఎంత మంది తప్పుకుంటారని చర్చ జరిగింది. గురువారం నామినేషన్ల గడవు ముగిసేసరికి నలుగురు పోటి నుంచి త‌ప్పుకున్నారు. అందులో ముగ్గురు రైతులు, ఒక‌రు స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు.

    ఒక లోక్‌సభ స్థానానికి 90 కంటే ఎక్కువ మంది పోటీచేస్తే బ్యాలట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే తెలంగాణ సీఈవో రజత్ కుమార్ వెల్లడించారు. నిజామాబాద్ అంతకంటే దాదాపు 2 రెట్లు ఎక్కువ మంది పోటీచేస్తుండడంతో బ్యాలట్ ఎన్నిక అనివార్యమైంది. ఎట్టకేలకు అభ్యర్థుల లెక్క తేలడంతో బ్యాలెట్ ఏర్పాట్లలో మునిగిపోయారు అధికారులు. ఎన్నికల్లో పోటీచేసే 185 మంది అభ్యర్థులందరికీ గుర్తులు అందుబాటులో ఉన్నాయని ఎన్నికలు అధికారులు వెల్లడించారు. వారికి గుర్తు కేటాయించే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికల ద్వారా దేశం దృష్టించిన రైతులకు మరి న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.
    First published:

    Tags: CM KCR, Farmer, Farmers Protest, Lok Sabha Election 2019, MP Kavitha, Nizamabad S29p04, Telangana Lok Sabha Elections 2019, Trs

    తదుపరి వార్తలు