బెంగాల్‌లో బీజేపీ వ్యూహం ఫలిస్తోందా... మమతాబెనర్జీకి షాక్ తప్పదా..?

Lok Sabha Election 2019 : ఎప్పుడూ లేనిది ఈసీ ప్రత్యేకాధికారాలు సైతం ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది బెంగాల్‌లో జరిగిన హింస వల్ల. ఈ పరిణామాలు బీజేపీకి కలిసొచ్చేలా ఉంటే, తృణమూల్ కాంగ్రెస్‌కి నష్టం చేసేలా కనిపిస్తున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: May 17, 2019, 7:52 AM IST
బెంగాల్‌లో బీజేపీ వ్యూహం ఫలిస్తోందా... మమతాబెనర్జీకి షాక్ తప్పదా..?
మమతా బెనర్జీ (Image : File)
  • Share this:
ప్రస్తుతం దేశం మొత్తం చూపు... పశ్చిమబెంగాల్ వైపు ఉంది. చివరి ఏడో దశలో అక్కడ 9 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుండగా... అవి అన్నీ అధికార తృణమూల్ కాంగ్రెస్‌కే చెందినవి కావడం విశేషం. ఐతే... ఆ స్థానాలను తృణమూల్ తిరిగి సంపాదించుకుంటుందా అన్నది తేలాల్సిన ప్రశ్న. పాలక, ప్రతిపక్షాల మధ్య తలెత్తిన ఆందోళనలు, హింస వల్ల అధికార పార్టీకే నష్టం జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. బెంగాల్‌లో మొత్తం 42 లోక్ సభ స్థానాలుండగా... 2014లో తృణమూల్ కాంగ్రెస్ ఏకంగా 34 సీట్లు సాధించి... తిరుగులేని పార్టీగా అవతరించింది. ఇప్పటికీ అక్కడ దీదీ పాలనపై చాలా వరకూ ప్రజల్లో సంతృప్తి ఉంది. ఐతే... 2014లో 30 శాతం ఓట్లను లెఫ్ట్ పార్టీలు సాధించాయి. ఇప్పుడా ఓట్లు బీజేపీ వశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం... బెంగాల్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు బీజేపీని చూస్తుండటమే. బీజేపీ ఎంత బలపడితే, తృణమూల్‌కి అంత నష్టం తప్పదు.

జై శ్రీరాం అంటూ హిందూవాదాన్ని బలంగా వినిపించిన బీజేపీ... ముస్లింలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అట్టహాసంగా ప్రచారం, ర్యాలీలు నిర్వహించింది. అదే సమయంలో... అమిత్ షా ర్యాలీ చేసినప్పుడు హింస చెలరేగడంతో... హిందువులు మమతా బెనర్జీపై ఆగ్రహిస్తూ... బీజేపీకి ఓటు వేస్తారని కమలనాథులు భావిస్తున్నారు. ప్రచార సమయాన్ని ఈసీ తగ్గించడం కూడా తమకే కలిసొస్తుందని కమల దళం లెక్కలేసుకుంటోంది. ఇదివరకు దేశవ్యాప్తంగా హిందూ వాదాన్ని తెరపైకి తెచ్చినప్పుడు కూడా ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్నాయంటున్న బీజేపీ నేతలు... బెంగాల్‌లోనూ అదే రిజల్ట్ వస్తుందని బలంగా చెబుతున్నారు.

2014లో బీజేపీకి 16 శాతం ఓట్లు వచ్చాయి. అప్పట్లో బీజేపీ రెండు స్థానాలు, లెఫ్ట్ 2 స్థానాలూ గెలుచుకున్నాయి. కాంగ్రెస్ 4 స్థానాలు దక్కించుకుంది. ఈసారి ఎన్నికల్లో బెంగాల్‌పై కాంగ్రెస్, వామపక్షాలు పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. అదే సమయంలో బీజేపీ మాత్రం ఉత్తరప్రదేశ్‌లో తగ్గబోయే సీట్లను బెంగాల్, బీహార్‌లో పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నెల 19న బెంగాల్‌లోని మిగిలిన 9 సీట్లకూ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 9 స్థానాల్లోనూ తృణమూల్ సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. వీటిలో ఒక్కటి తగ్గినా... అది తృణమూల్‌కి నష్టమే.

ఈ 9 సీట్లలో జాదవ్‌పూర్‌, దక్షిణ కోల్‌కతా... మమతకు ఒకప్పటి సొంత స్థానాలు. ఆమె రాజకీయ ప్రయాణం మొదలైంది అక్కడి నుంచే. 1984లో ఆమె జాదవ్‌పూర్‌లోనే లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమ్‌నాథ్‌ ఛటర్జీని ఓడించారు. ఆ తరువాత దక్షిణ కోల్‌కతాకు మారి అక్కణ్నుంచి ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఐతే... ఆ 9 స్థానాల్లో బీజేపీకి ఒక్క స్థానం దక్కినా కమలనాథులకు అది ప్లస్ పాయింటే. ఐతే... ఈ 9 స్థానాల్లో 6 చోట్ల హిందీ మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్నారు. అక్కడి వారు బీజేపీవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈసారి బీజేపీ అక్కడ అత్యంత భారీగా ప్రచారం చేపట్టింది. 

ఇవి కూడా చదవండి :

100+18 ఇదీ వైసీపీ లెక్క... జగన్ చేయించిన 5 సర్వేల్లో తేలిందేంటి..?జనసేన పోటీ వెనక చంద్రబాబు వ్యూహం..? పక్కా ప్లాన్‌తో అంతా జరుగుతోందా..?

కౌంటింగ్ రోజున ఏం జరుగుతుందంటే... పూర్తి వివరాలు ఇవిగో...
First published: May 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>