హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Delhi Lockdown: సీఎం ప్రకటించగానే వైన్స్ ముందు క్యూ కట్టారు.. ఈవిడేదో అంటోంది చూడండి..!

Delhi Lockdown: సీఎం ప్రకటించగానే వైన్స్ ముందు క్యూ కట్టారు.. ఈవిడేదో అంటోంది చూడండి..!

ఢిల్లీలో వైన్ షాప్స్ ముందు దృశ్యాలు

ఢిల్లీలో వైన్ షాప్స్ ముందు దృశ్యాలు

ఢిల్లీలో కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ఏ క్షణమైనా లాక్‌డౌన్ ప్రకటన రావొచ్చనే ప్రచారం ఆదివారం సాయంత్రం నుంచే మొదలైంది. దీంతో.. ఈలోపే మందు తెచ్చుకుంటే బెటరని భావించిన మందుబాబులు వైన్స్ ముందు క్యూ కట్టారు. అనుకున్నట్టుగానే సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలో ఇవాళ రాత్రి 10 గంటల నుంచి ఏప్రిల్ 26వరకూ..

ఇంకా చదవండి ...

  న్యూఢిల్లీ: లాక్‌డౌన్ పేరు వింటే చాలు మందుబాబుల గుండెల్లో దడ పుడుతోంది. కరోనా సోకుతుందన్న భయం కంటే లాక్‌డౌన్ విధిస్తే మందు దొరకదన్న బెంగ మందుబాబులను వెంటాడుతోంది. దీంతో.. కొందరు మందుబాబులు ముందుగానే స్టాక్ తెచ్చుకుని పెట్టుకుంటున్నారు. మరికొందరైతే.. లాక్‌డౌన్ ప్రకటన ఏ క్షణమైన రావొచ్చన్న ప్రచారం నేపథ్యంలో వైన్స్ ముందు క్యూ కడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇదే దృశ్యం కనిపించింది. ఢిల్లీలో కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ఏ క్షణమైనా లాక్‌డౌన్ ప్రకటన రావొచ్చనే ప్రచారం ఆదివారం సాయంత్రం నుంచే మొదలైంది. దీంతో.. ఈలోపే మందు తెచ్చుకుంటే బెటరని భావించిన మందుబాబులు వైన్స్ ముందు క్యూ కట్టారు. అనుకున్నట్టుగానే సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలో ఇవాళ రాత్రి 10 గంటల నుంచి ఏప్రిల్ 26వరకూ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. సీఎం లాక్‌డౌన్ ప్రకటన చేసిన కొద్దిసేపటికే మందుబాబులు లిక్కర్ షాపుల ముందు బారులు తీరారు. ఏమాత్రం సోషల్ డిస్టెన్స్ పాటించకుండా క్యూలో నిల్చుని మందును కొనుగోలు చేస్తూ కనిపించారు. ఢిల్లీలోని ఖాన్ మార్కెట్‌తో పాటు పలు ప్రాంతాల్లోని వైన్స్ ముందు ఇవే దృశ్యాలు కనిపించాయి. కొంతలో కొంత సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. మాస్క్ పెట్టుకోకుండా వెళితే మద్యం కొనుక్కునే అవకాశం లేని కారణంగా మందు బాబులంతా మాస్క్‌లు పెట్టుకున్నారు. ఓ లిక్కర్ షాపు దగ్గర మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన ఓ మహిళ చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయిస్తున్నాయి.


  ఢిల్లీలోని శివ్‌పురి గీతా కాలనీలో ఉన్న ఓ లిక్కర్ షాపు దగ్గరకు ఒక మహిళ మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చింది. ఆ సమయంలో ఆమె మాట్లాడుతూ.. ఇంజెక్షన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, ఆల్కహాల్ వల్లే ఉపయోగం ఉందని చెప్పింది. మందుల వల్ల ప్రయోజనం లేదని, పెగ్గు వల్లే ప్రయోజనం ఉందని ఆ మహిళ చేసిన వ్యాఖ్యలు మందుబాబుల ఆలోచనలకు అద్దం పడుతున్నాయి.

  ఇదిలా ఉంటే.. ఢిల్లీలో లాక్‌డౌన్ ప్రకటన చేసిన సందర్భంలో సీఎం కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో 23,500 కరోనా కేసులు నమోదయ్యాయని సీఎం చెప్పారు. పాజిటివిటీ రేటు, వైరస్ వ్యాప్తి పెరిగిందని కేజ్రీవాల్ తెలిపారు. రోజుకు 25,000 కరోనా కేసులు నమోదయితే.. అందుకు తగినన్ని బెడ్లు లేవని, బెడ్స్ కొరత ఉందని సీఎం చెప్పారు. నిత్యావసరాలు, మెడికల్ సేవలు, ఫుడ్ సర్వీసెస్ కొనసాగుతాయని.. లాక్‌డౌన్ నుంచి ఈ సేవలకు మినహాయింపు ఉందని కేజ్రీవాల్ తెలిపారు. పెళ్లిళ్ల వంటి వేడుకలకు 50 మంది కంటే ఎక్కువగా హాజరవకూడదని, పెళ్లి వేడుక చేసుకునేవారికి ప్రత్యేకంగా పాసులు మంజూరు చేయనున్నట్లు సీఎం చెప్పారు. ఇక.. బెడ్స్ కొరతకు సంబంధించి కూడా సీఎం కీలక ప్రకటన చేశారు. ఢిల్లీలో ఈ ఆరు రోజుల లాక్‌డౌన్ సమయంలో మరిన్ని బెడ్స్ ఏర్పాటు చేస్తామని కేజ్రీవాల్ తెలిపారు. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆక్సిజన్, మెడిసిన్ తగినన్ని ఉండేలా చూసుకుంటామని సీఎం చెప్పారు. అందరూ లాక్‌డౌన్‌పై ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని సీఎం కోరారు.

  అంతేకాదు.. ఢిల్లీలో ఉన్న వలస కార్మికులకు కూడా సీఎం ఓ అభ్యర్థన చేశారు. చేతులెత్తి నమస్కరిస్తున్నానని.. ఇది పరిమిత లాక్‌డౌన్ మాత్రమేనని, కేవలం ఆరు రోజులేనని సీఎం చెప్పారు. దయచేసి ఎవరూ ఢిల్లీ వదిలి వెళ్లవద్దని ఆయన కోరారు. ఈ లాక్‌డౌన్‌ను పొడిగించాల్సిన పరిస్థితి రాదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానన్న కేజ్రీవాల్, ప్రభుత్వం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుందని వలస కార్మికులకు హామీ ఇచ్చారు.

  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Corona, Covid-19, Delhi, Lockdown

  ఉత్తమ కథలు