Lockdown: ద‌శ‌ల‌వారీగా లాక్‌డౌన్ ఎత్తివేత.. మే 31 నుంచి అన్‌లాక్ ప్రక్రియ.. వెల్లడించిన సీఎం

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(ఫైల్ ఫొటో)

లాక్‌డౌన్ విధించడం వల్ల.. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీ ప్రభుత్వం అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించేందుకు రెడీ అయింది. దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తివేయనున్నట్టు సీఎం ప్రకటించారు.

  • Share this:
    దేశ రాజధాని ఢిల్లీలో దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయనున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ప్రకటించారు. మే 31 నుంచి దశలవారీగా లాక్‌డౌన్ నిబంధనలను సడలించనున్నట్టు తెలిపారు. కరోనా సేకండ్ వేవ్‌పై ఢిల్లీ నియంత్రణ సాధించిందని.. అయితే వైరస్‌పై పోరాటం ముగియలేదని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ సమావేశంలో, లాక్డౌన్ క్రమంగా ఎత్తివేయాలని నిర్ణయించారు. గత శనివారం మరో వారం రోజుల పాటు ఢిల్లీలో లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రకటించిన సీఎం కేజ్రీవాల్.. కరోనా కేసులు తగ్గుదల కొనసాగితే మే 31 నుంచి అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించనున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో.. ముందుగా చెప్పినట్టుగానే సీఎం కేజ్రీవాల్ అన్‌లాక్ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

    ‘చాలా సమస్యలను ఎదుర్కొన్న తర్వాత.. సెకండ్ వేవ్‌పై నియంత్రణ సాధించాం. అంటే దీని అర్థం కరోనాపై పోరాటం ముగిసినట్టు కాదు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉంది. గత 24 గంటల్లో పాజిటివిటీ రేటు 1.5 శాతం వద్ద ఉంది’అని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. అన్‌లాక్ ప్రక్రియలో ముందుగా అట్టడుగు వర్గాలవారిని దృష్టిలో ఉంచుకోవాలని, వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేజ్రీవాల్ అన్నారు. రోజువారీ కూలీలు, కార్మికులు, వలస కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. ఫ్యాక్టరీలను తెరవడంతో పాటుగా, నిర్మాణ కార్యాకలాపాలను అనుమతించాలని నిర్ణయించినట్టు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ప్రతివారం నిపుణులు, ప్రజల అభిప్రాయాల ఆధారంగా అన్‌లాక్‌ ప్రక్రియ కొనసాగించనున్నట్టు ఆయన చెప్పారు.

    కరోనా సెకండ్‌వేవ్‌తో గత కొద్ది రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఓ వైపు ఆక్సిజన్ కొరత మరోవైపు ఆసుపత్రుల్లో బెడ్స్ కొరతతో కొద్ది రోజుల పాటు నరకం చూశారు. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లాక్‌డౌన్ నిర్ణయాన్ని ప్రకటించారు. ముందుగా వారాంతపు లాక్డ్‌న్ ప్రకటించిన కేజ్రీవాల్ ఏప్రిల్ 19 నుండి పూర్తిస్థాయి లాక్డౌన్ ప్రకటించారు. ఆ తర్వాత పలుమార్లు లాక్‌డౌన్‌ను పొడిగించారు.
    Published by:Sumanth Kanukula
    First published: