రైలు ప్రమాదాల చరిత్రలోనే అనూహ్య ఘటన ఆదివారం చెన్నై నగరంలో చోటుచేసుకుంది. సాధారణంగా కొద్ది పాటి వేగంతో రైలు పట్టాలు తప్పినప్పుడు పక్కకు ఒరగడం, స్పీడు ఎక్కువగా ఉంటే బోగీలు ఒకదానిపై మరోటి పడిపోవడం తెలిసిందే. అయితే, ఇవాళ జరిగిన ప్రమాదంలో మాత్రం రైలు పట్టాలు తప్పి, ఏకంగా మీటరు ఎత్తున్న ప్లాట్ ఫామ్ పైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ప్లాట్ ఫామ్ ధ్వంసం కాగా, అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పింది. వివరాలివి..
తమిళనాడు రాజధాని చెన్నైలో విరివిగా తిరిగే ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (ఈఎంయూ) లోకల్ రైళ్లకు సంబంధించి ఇవాళ ప్రమాద ఘటన జరిగింది. బీచ్ స్టేషన్ లో ఓ సబర్బన్ రైలు పట్టాలు తప్పి, ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకువచ్చింది. చెన్నై వర్క్‌షాప్ నుంచి కోస్టల్ రైల్వేస్టేషన్ వెళ్తున్న సమయంలో నియంత్రణ కోల్పోయి భారీ శబ్దంతో ప్లాట్‌ఫామ్ వైపు దూసుకురావడంతో అక్కడ ఉన్న వారంతా పరుగులు పెట్టారు.
Train on the platform in Chennai,
Minor injury to train driver in crash@GMSRailway #ChennaiLocalTrain @News18TamilNadu pic.twitter.com/QGQBOK7CRS
— Balasubramani க.பாலசுப்ரமணி (@balasubramanikk) April 24, 2022
‘షెడ్ లైన్ నుంచి రైలు 1వ నంబర్ ప్లాట్‌ఫారమ్ వైపునకు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బీచ్ స్టేషన్ లో ప్లాట్‌ఫారమ్ 1 కొంత భాగం దెబ్బతినింది. రైలు ఖాళీగా ఉండటం, ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ప్రయాణికులు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పినట్లయింద’ని ప్రత్యక్ష సాక్షులు, అధికారులు పేర్కొన్నారు. అయితే లోకో పైలట్(రైలు డ్రైవర్) మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఆదివారం సెలవు కావడంతో ప్రయాణికుల రద్దీ లేదని, గాయపడ్డ రైలు డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించామని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెప్పారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చనే అనుమానాలున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai, Tamil nadu, Train, Train accident