భారత ప్రభుత్వం తాజాగా బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (Battlegrounds Mobile India - BGMI) గేమ్‌ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. పబ్‌జీ బ్యాన్ అయిన పది నెలల తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్ గేమ్‌ను దక్షిణ కొరియాకు చెందిన క్రాఫ్టన్ (Krafton) ఇండియాలో లాంచ్ చేసింది. పేరుకి BGMI అయినా కూడా ఇది అచ్చుగుద్దినట్టు పబ్‌జీ గేమ్ లాగానే ఉంటుంది. ఈ గేమ్‌ను భారతదేశం, భారత ప్రజల శ్రేయస్సు కొరకు నిషేధించినట్లు తెలుస్తోంది. అయితే BGMIని బ్యాన్ చేసినందుకు ప్రహార్ (Prahar) అనే ఒక ఎన్జీవో (NGO) సంస్థ బాగా సంతోషం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు, తాజాగా ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలిపింది.
బ్యాన్ ప్రకటించిన అనంతరం ప్రహార్ ప్రెసిడెంట్ అభయ్ మిశ్రా మాట్లాడుతూ, “ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి BGMI, బ్యాన్ అయిన PUBG ఒకటే అనే వాస్తవాన్ని మేం నొక్కి చెబుతున్నాం. BGMI అనేది కొత్త అవతార్‌లో వచ్చిన PUBG గేమ్. ఈ రెండిటికి మధ్య ఎలాంటి తేడా లేదు. BGMIని టెన్సెంట్ ఇప్పటికీ బ్యాక్‌గ్రౌండ్‌లో కంట్రోల్ చేస్తోంది. భారతదేశ భద్రత, సార్వభౌమాధికారం కోసం ఈ చర్య తీసుకున్నందుకు మేం భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం" అని పేర్కొన్నారు. ప్రహార్ ఎన్జీవో BGMIని చైనీస్ గేమ్‌గా ఎప్పటి నుంచో పిలుస్తోంది. కానీ ఇండియాలో BGMIని తెచ్చిన క్రాఫ్టన్ కంపెనీ గేమ్ లాంచ్ సందర్భంగా.. తమకు ప్రత్యేకంగా ఏ చైనీస్ భాగస్వాములతో లేదా టెన్సెంట్‌తో లింక్‌లు లేవని చెప్పింది. భారతదేశంలో బీజీఎమ్ఐని నిషేధించడానికి భద్రత, డేటా షేరింగ్ వంటివి కారణాలు అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రహార్ NGO కొంతకాలంగా ఇండియాలో BGMI గేమ్‌ను అనుమతించినందుకు ఆందోళనలు వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 2022లో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69A ప్రకారం చైనీస్ యాప్ BGMIని బ్లాక్ చేయమని ప్రహార్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY)కి లేఖ రాసింది. ఇది సార్వభౌమత్వానికి, భారతదేశ సమగ్రత, భారతదేశ రక్షణ, రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగిస్తుందని NGO పేర్కొంది. RSS అనుబంధ స్వదేశీ జాగరణ్ మంచ్ (SJM) కూడా ఈ సమస్యపై ప్రహార్‌కు సపోర్ట్ చేసింది. గతంలో అభయ్ మిశ్రా మాట్లాడుతూ.. BGMI-PUBG యాప్ మునుపటి యజమానులు, చైనా ప్రభావాన్ని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశోధించాలని.. బ్యాన్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు.
“2022, మార్చిలో మేం BGMI కంట్రోల్ చేస్తున్న క్రాఫ్టన్‌కు, టెన్సెంట్ కి మధ్య ఉన్న రహస్య సంబంధాలపై 10 కోణాల ప్రశ్నలకు సమాధానాలు కోరుతూ టెన్సెంట్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు చైనీస్ బిలియనీర్, టెన్సెంట్ PUBG ఫౌండర్ పోనీ మా (Pony Ma)కు బహిరంగ లేఖ కూడా రాశాం. కానీ ఆయన నుంచి ఎలాంటి మౌనమే సమాధానంగా వినిపించింది ”అని మిశ్రా అన్నారు. ఇప్పుడు ఈ గేమ్ బ్యాన్ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BGMI, Mobile game, PUBG, PUBG Mobile India