ఎవరు చేసిన ఖర్మ వారు అనుభవించక తప్పదన్నారు పెద్దలు. అలానే ఓ చిరుతను కుక్కను ఆహారంగా చేసుకోవాలని వేటాడి వెంటాడి... చివరకు తనప్రాణాలే చిక్కుల్లో పడేసుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమనేర్లో చోటుచేసుకుంది. చిక్లి రాజ్పూర్ గ్రామంలో మంగళవారం నాడు చోటుచేసుకున్న ఓ ఘటన గ్రామం మొత్తాన్ని ఓ బావివద్దకు పరుగులు తీసేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన ఓ రైతు పెంపుడు కుక్క కనిపించకుండా పోయింది. దాన్ని వెతుక్కుంటూ వెళ్లిన రైతుకు ఓ మారుమూల ప్రాంతం నుంచి కుక్క అరుపులు వినపడ్డాయి. వాటిని ఫాలో అవుతూ వెళ్లిన రైతు అది ఓ బావిలో పడిపోయిన విషయాన్ని గమనించాడు. అయితే అదే బావిలో కుక్కతో పాటు చిరుత కూడా ఉండటాన్ని గమనించిన రైతు షాక్ తిన్నాడు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు.
ఘటనస్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు కొన్ని గంటలపాటు శ్రమించి బావిలో పడ్డ కుక్కతో పాటు చిరుతను కూడా బయటకు తీశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద ఎత్తున బావి వద్దకు చేరారు. అయితే కుక్కను వేటాడుతూ వెళ్తూనే చిరుత కూడా బావిలో పడిపోయిందని చెబుతున్నారు అధికారులు. బావిలో పడిన తర్వాత తన ప్రాణాలు ఆపదలో పడ్డాయని గమనించిన చిరుత కుక్కకు మాత్రం ఎలాంటి అపాయం తలపెట్టలేదు. దీంతో తన పెంపుడు కుక్క చిరుత నుంచి ప్రాణాలతో బయటపడటంతో రైతు కళ్లలో ఆనందానికి అవధుల్లేవు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.