హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Lakhimpur Kheri: ఉత్తరప్రదేశ్‌లోని లకింపూర్‌ ఖేరీలో రైతుల ఆందోళన హింసాత్మకం.. ఆరుగురు మృతి

Lakhimpur Kheri: ఉత్తరప్రదేశ్‌లోని లకింపూర్‌ ఖేరీలో రైతుల ఆందోళన హింసాత్మకం.. ఆరుగురు మృతి

మంటల్లో వాహనం

మంటల్లో వాహనం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లకింపూర్‌ ఖేరీ (Lakhimpur Kheri) జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేంద్ర మంత్రి పర్యటను వ్యతిరేకంగా రైతులు నిరసన చేపట్టారు. అయితే అక్కడ హింస చెలరేగడంతో ఆరుగురు మరణించినట్టుగా అధికార వర్గాలు తెలిపాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లకింపూర్‌ ఖేరీ (Lakhimpur Kheri) జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ కుమార్ మిశ్రా (Ajay Kumar Mishra), ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య (Keshav Prasad Maurya) పర్యటనకు వ్యతిరేకంగా రైతులు నిరసన చేపట్టారు. అయితే అక్కడ హింస చెలరేగడంతో ఆరుగురు మరణించినట్టుగా అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో ఇద్దరు రైతులు ఉన్నారు. లకింపూర్‌ ఖేరీ జిల్లా టికునియాలో ఆదివారం ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా, ఉప ముఖ్య మంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పాల్గొనాల్సి ఉంది. అయితే వీరి పర్యటనకు వ్యతిరేకంగా టికోనియా-బన్‌బీర్‌పూర్ రహదారి వద్ద రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అయితే వారి మీదకు రెండు ఎస్‌యూవీ వాహనాలు దూసుకెళ్లడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన రైతులు.. రెండు ఎస్‌యూవీ వాహనాలను తగలపెట్టారు. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అక్కడ జరిగిన హింసలో మొత్తం ఆరుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఇంకా ఈ ఘటనలో పలువురు జర్నలిస్టులు కూడా గాయపడినట్టుగా సమాచారం. ఆ ప్రాంతంలో పరిస్థితులును అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

ఇక, ఈ ఘటనకు సంబంధించి సంయుక్త కిసాన్ మోర్చా (Samyukt Kisan Morcha) ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. రైతులను ఢీ కొట్టిన కార్లు కేంద్ర మంత్రి కుమారుడివని సంయుక్త కిసాన్ మోర్చ ఆరోపించింది. తమ సంఘం నాయకుడు తజీందర్ సింగ్ విర్క్ (Tajinder Singh Virk) తీవ్రంగా గాయపడినట్టుగా పేర్కొంది. ఇక, ఈ ఘటనను రైతు నాయకుడు రాకేశ్ తికైత్ (Rakesh Tikait) తీవ్రంగా ఖండించారు. ఆయన ఘాజీపూర్ నుంచి లకింపూర్ బయదేరినట్టుగా చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి విపక్షాలు యోగి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు తన కొడుకుపై వచ్చిన ఆరోపణలను కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా ఖండించారు. ఈ ఘటన జరిగినప్పుడు తన కొడుకు అక్కడ లేడని ఆయన తెలిపారు. ఈ ఘటనను తాను ఖండిస్తున్నట్టుగా చెప్పారు. ఈ మొత్తం ఘటనను ఆయన కుట్రగా అభిప్రాయపడ్డారు. తన డ్రైవర్ నడుపుతున్న వాహనంపై రాళ్ల దాడి జరిగడంతో అది బోల్తా పడిందని.. ఇద్దరు రైతులు కిందపడి మరణించారని చెప్పారు. మొత్తం ఎనిమిది మంది చనిపోయారని అన్నారు. మరణించిన వారిలో తన డ్రైవర్, ముగ్గురు బీజేపీ కార్యకర్తలు, ఇద్దరు రైతులు ఉన్నట్టుగా చెప్పారు. తన డ్రైవర్, బీజేపీ కార్యకర్తలను చంపేసి వాహనాన్ని తగలబెట్టారని ఆయన ఆరోపించారు.

ఇందుకు సంబంధించి అజయ్ కుమార్ మిశ్రా CNN-News18‌తో మాట్లాడుతూ..‘నా కుమారుడు ఆ ప్రదేశంలో లేదు. అతనిపై ఆరోపణలు అబద్ధం’అని చెప్పారు. తన కొడుకు పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తాడని చెప్పారు.

ఈ ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే లక్నో బయలుదేరారు. అధికారులపై ఈ విషయంపై చర్చించారు. పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలని ఆదేశించారు. మరోవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఈ ఘటనలో మరణించిన రైతులను పరామర్శించేందుకు లఖింపూర్ ఖేరీ వెళ్లనున్నారు.

First published:

Tags: Uttar pradesh