ఉద్యోగుల జీతాలు (Employee Lary), సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు, ఆరోగ్య రక్షణకు సంబంధించి నాలుగు కొత్త లేబర్ కోడ్స్ (New Labour Codes)ను ప్రభుత్వం తీసుకొచ్చింది. వీటికి పార్లమెంటు ఆమోదం కూడా తెలిపింది. ఈ కొత్త చట్టాలు (New Labour Laws) ఈ ఏడాదిలో అమల్లోకి రానున్నాయి. వీటిలో ఒకటైన వేతన కోడ్ (Code On Wages) అమల్లోకి వస్తే ఉద్యోగుల పీఎఫ్ కాంట్రిబ్యూషన్లు (PF Contributions) పెరుగుతాయి. అయితే ఈ కాంట్రిబ్యూషన్లు అధికంగా ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి లేబర్ కోడ్‌లు లేదా వేతన కోడ్ అమలు తేదీ ఎప్పుడనే దానిపై స్పష్టత లేదని నిపుణులు తెలిపారు. అలాగే వేతన కోడ్ వల్ల ఉద్యోగుల జీతాలు, పీఎఫ్ విరాళాలు, గ్రాట్యుటీపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఆ ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* అధిక వేతనాలు
ప్రస్తుతం ప్రైవేట్ సంస్థలలో బేసిక్ శాలరీ సాధారణంగా టోటల్ కాస్ట్-టు-కంపెనీ (CTC)లో 25-40 శాతంగా ఉంది. అయితే కొత్త కోడ్ అమల్లోకి వచ్చాక.. కంపెనీ చెల్లించే జీతంలో బేసిక్ శాలరీ 50% శాతంగా ఉండటం తప్పనిసరి. పదవీ విరమణ పొందిన తరువాత (Post Retirement) ఆర్థిక భద్రతకు అధిక బేసిక్ శాలరీ సహాయపడుతుంది. ప్రస్తుతం ఉన్న బేసిక్ శాలరీ పెరిగితే ప్రావిడెంట్ ఫండ్ విరాళాలు, గ్రాట్యుటీ మొత్తంలో మార్పులు వస్తాయి.
* పీఎఫ్ కాంట్రిబ్యూషన్
బేసిక్ శాలరీ నెలకు రూ.15,000 కంటే ఎక్కువ ఉంటే, పీఎఫ్ కాంట్రిబ్యూషన్స్ అనేవి వేతన కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా మారకుండా ఉండొచ్చని నిపుణులు తెలిపారు. ఉద్యోగుల బేసిక్ శాలరీలు చట్టబద్ధమైన వేతన పరిమితి అయిన రూ.15,000 కంటే ఎక్కువ ఉన్నంత వరకు, యజమాని అధిక వేతనాలపై కాంట్రిబ్యూషన్స్ అందించాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. ఇలాంటి సందర్భాలలో పీఎఫ్ కాంట్రిబ్యూషన్స్ మారకపోవచ్చు. ఒకవేళ పీఎఫ్ కాంట్రిబ్యూషన్స్ పెరిగితే టేక్-హోమ్ శాలరీ తగ్గుతుంది. చివరకు కంపెనీ పాలసీలకు ఈ విరాళాలు వ్యతిరేకంగా మారవచ్చు. కంపెనీ పీఎఫ్ విరాళాల విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు. ఏ నిర్ణయం తీసుకున్నా ఉద్యోగులపై మాత్రం ప్రతికూల ప్రభావం పడదు.
* గ్రాట్యుటీపై ప్రభావం
గ్రాట్యుటీ అనేది ఒక సంస్థ నుంచి తప్పుకున్న ఉద్యోగులకు లేదా కనీసం ఐదేళ్లపాటు నిరంతరం పనిచేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించే మొత్తం. గ్రాట్యుటీని ఉద్యోగి చివరిగా తీసుకున్న జీతం, సర్వీస్ సంవత్సరాల సంఖ్య ఆధారంగా లెక్కిస్తారు. అయితే ఒక్కో ఉద్యోగికి చెల్లించాల్సిన గ్రాట్యుటీ మొత్తం గరిష్టంగా రూ.20 లక్షలు ఉంటుంది. కొత్త కోడ్‌ల ప్రకారం, జీతాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గ్రాట్యుటీ పేమెంట్ కూడా ఎక్కువగా ఉంటుందని నిపుణులు తెలిపారు. అయితే, గ్రాట్యుటీ మొత్తం కాస్ట్-టు-కంపెనీ(CTC)లో ఒక భాగంగా కంపెనీలు అందిస్తుంటే మాత్రం టేక్-హోమ్ శాలరీ తగ్గే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Employees, Epf, Full salary, New Labour Codes