కర్ణాటక సీఎం కుమారస్వామి అంటే చాలు.. ‘ఆయనకు భక్తి ఎక్కువ. మూఢనమ్మకాలు ఎక్కువ. కాలు తీసి కారులో పెట్టాలంటే కూడా ముహూర్తాలు చూసుకుంటారు. తిథి, వారం, నక్షత్రం చూసుకోకుండా ఏ పనులూ మొదలు పెట్టరు.’ అని చాలా ఎక్కవగా ప్రచారంలో ఉంది. ఆ ప్రచారానికి తగ్గట్టే ఆయన కుటుంబం కూడా నడుచుకుంటూ ఉంటుంది. ‘మంచి రోజు’ కాకపోతే ఆయన కనీసం కేబినెట్ సమావేశాలు కూడా నిర్వహించరని ప్రచారం ఉంది. ఆషాఢ మాసంలో కనీసం ఆయన ఒక్కసారి కూడా మంత్రివర్గ భేటీ నిర్వహించకపోవడం అందుకు ఊతమిచ్చింది. ఆ సమయంలో వరదలు వచ్చి.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. కుమారస్వామి కేబినెట్ భేటీ ఏర్పాటుచేసి.. ఏం చేద్దాం అని చర్చించలేదన్న అపవాదు ఉంది.
అయితే, నమ్మకాల మీద ఇంత నమ్మకం ఉన్న కుమారస్వామి ఇప్పుడు ఓ ట్విస్ట్ ఇవ్వబోతున్నారు. కర్ణాటకలో కావేరి నది పుట్టిన తలకావేరి ప్రాంతంలో పర్యటించనున్నారు. ఇక్కడో కొత్త విషయం ఉంది. సాధారణంగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు ఈ తలకావేరి ప్రాంతంలో పర్యటిస్తే.. వారికి పదవీగండం ఉంటుందని ప్రచారం. గతంలో కొందరు పదవిలో ఉన్న నాయకులు అక్కడ పర్యటించిన తర్వాత పదవిని కోల్పోయారని చెబుతారు. అయితే, అలాంటివన్నీ మూఢనమ్మకాలని నిరూపించడానికి కుమారస్వామి బయలుదేరారు.

పూజలు నిర్వహిస్తున్న కుమారస్వామి (File)
17వ తేదీ (బుధవారం) ఆయన తలకావేరి ప్రాంతంలో పర్యటిస్తారు. కుమారస్వామి నిర్ణయం కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. కుమారస్వామి.. ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? ఆయన నిజంగా వెళతారా అనేసందేహాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయితే, నమ్మకాలు వేరు.. మూఢనమ్మకాలు వేరు అని జేడీఎస్ వర్గాలు చెబుతున్నాయి.

వినాయకుడికి పూజలు చేస్తున్న మాజీ ప్రధాని దేవెగౌడ (File:PTI)
Published by:Ashok Kumar Bonepalli
First published:October 16, 2018, 19:57 IST